అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వ తారకమంత్రమని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు స్పష్టం చేశారు. ప్రతి మంత్రిత్వశాఖకు సంబంధించి వచ్చే వంద రోజుల్లో చేయాల్సిన పనులపై కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ఆర్థిక అంశాలతో ముడిపడని హామీలు తక్షణం అమలు చేయాలని దిశానిర్దేశం చేసారు. భారీ విజయాన్ని అందించిన ప్రజలకు కూటమి ప్రభుత్వంపై ఎన్నోఅంచనాలు ఉన్నందున వాటికీ తగ్గట్లు ప్రతిఒక్కరు కష్టపడాలని ఆదేశించారు.
కాన్వాయ్‌లు, సైరన్‌ల వంటి ఆడంబరాలకు స్వస్తిపలికి ప్రజలతో మమేకం కావాలన్నారు. ఏ పని చేసినా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చూడాలని స్పష్టం చేశారు. శాఖాపరమైన సమీక్షా సమావేశాల సమయం తగ్గించుకోవాలని, వీలైనంత వరకు సాయంత్రం ఆరు గంటల తర్వాత సమావేశాలు వద్దని చంద్రబాబు సూచించారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని వెంటనే చేయగలిగినవి, ఆర్థికపరమైన అంశాలతో ముడిపడినవి అని రెండు విభాగాలుగా చేసుకోవాలని చంద్రబాబు తెలిపారు.