అచ్యుతాపురం ఘటనలో చంద్రబాబు సర్కారు వ్యవహరించిన తీరు బాధ కలిగించిందని అన్నారు మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి. శుక్రవారం ఉదయం అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన ఆయన బాబు సర్కార్‌ను దుమ్మెత్తిపోశారు. పేలుడు జరిగింది పగలని గుర్తుచేసిన ఆయన…సమాచారం అందిన వెంటనే హోంమంత్రి పర్యవేక్షణకు వెళ్తున్నానన్న ఊసే లేదని మండిపడ్డారు. కార్మిక శాఖ మంత్రి కూడా తన వద్ద సమాచారం లేదని చేతులెత్తేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. తొలుత ఎంతమంది చనిపోయారో అధికార పార్టీనేతలకు తెలియనే తెలియదన్న ఆయన…ఘటనాస్థలికి అంబులెన్స్‌లు రాని దుస్థితి ఈ ప్రభుత్వంలో ఏర్పడిందని, బాధితుల్ని కంపెనీ బస్సుల్లో ఆస్పత్రులకు తరలించడంపై విచారం వ్యక్తం చేశారు మాజీ సీఎం జగన్.
జగన్‌కి సిగ్గురాదన్న అచ్చెన్న..?
తమ ప్రభుత్వంపై జగన్ చేసిన ఆరోపణలకు కౌంటర్ అటాక్ చేశారు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ప్రమాదంలో నష్టపోయిన ప్రతిఒక్కరినీ ఆదుకునేలా మేం చర్యలు తీసుకుంటుంటే…ధర్నా చేస్తానని జగన్ చెప్పడం దేనికి సంకేతం అంటూ ఎదురుదాడికి దిగారు. సంఘటన జరిగిన వెంటనే నిమిషాల వ్యవధిలో ప్రభుత్వ యంత్రాంగం అంబులెన్స్‌లతో వచ్చిమరీ సహాయక చర్యల్లో నిమగ్నమైందన్న మంత్రి అచ్చెన్న…ద్విచక్ర వాహనాలపై రోగులను ఆస్పత్రులకు తీసుకెళ్లిన సంఘటనలు వైసీపీ హయాంలోనే ఎక్కువగా చోటుచేసుకున్నాయని మండిపడ్డారు. ఎల్జీ పాలిమర్స్ బాధితులకు గొప్పగా న్యాయం చేశామని బీరాలు పలుకుతున్న జగన్‌కు …ఆయన ప్రకటించిన పరిహారం పూర్తిస్థాయిలో అందలేదన్న విషయం ఆయనకు తెలుసా అని ఎద్దేవా చేశారు. దుర్ఘటన జరిగాక 15 రోజుల వ్యవధిలో చనిపోయిన ముగ్గురికి రూ.లక్ష చొప్పున బాధితు కుటుంబాలకు విదిల్చింది మీరుకాదా అంటూ ఫైరయ్యారు. అలాగే బాధిత కుటంబాలను ఆదుకోవాలని రోడ్డెక్కి నిరసన చేపట్టిన 30మందిపై గోపాలపట్నం పీఎస్‌లో కేసుపెట్టింది జగన్‌రెడ్డి కాదా అంటూ మంత్రి అచ్చెన్న ప్రశ్నల వర్షం అందుకున్నారు.