ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఒక సామాన్య ప్రయాణికుడిలా ప్రయాణించారంటే నమ్ముతారా..?…అవును మీరు విన్నది నిజమే. ఆయన తన భార్య భారతితో కలిసి విమానంలో ప్రయాణిస్తున్న ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఎవరు తీశారు?..ఎందుకు తీశారు?…ఎక్కడికి వెళ్తుంటే తీశారు..? అనే ప్రశ్నలు పక్కనపెడితే…సీఎం హోదాలో ఉన్నప్పుడు పరదాలు కట్టి ప్రజల్లోకి వెళ్లిన జగన్…ఇప్పుడు సామాన్యమైన వ్యక్తినని కవరింగ్ ఇచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న టాక్ అయితే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా ప్రత్యేక విమానాల్లో ప్రయాణించిన ఆయన…ప్రస్తుతం సాధారణ ప్రయాణికుడిలా ఎకానమీ క్లాసుల్లో ప్రయాణించడం సర్వత్రా చర్చకు దారితీసింది.
చదవండి: మనకే కాదు, కొన్నిదేశాలకూ రేపు పండగే..!
జగన్‌కు తత్వం బోధ పడిందా..?
ప్రజాసంకల్పయాత్ర పేరుతో నాడు ప్రజల్లో తిరిగి…తీరా అధికారం వచ్చాక ‘బటన్ నొక్కామా..బంగ్లాకు పోయామా’ అన్న రీతిలో ఆయన వ్యవహిరించిన తీరు.. సొంత పార్టీ శ్రేణులకి, అభిమానులకే రుచించలేదు. ప్రజల్లోకి రావాలంటే పరదాలు కట్టుకుని మరీ వచ్చేవారన్న మాటను జగన్ మూటగట్టుకున్నారు. సో, ఇప్పుడీ కళంకాన్ని చెరుపుకునేందుకు ఆయన పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావంటూ ఈ ఫోటోను ఉద్దేశిస్తూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.
నాడు అధికారంలో ఉన్నప్పుడు ఇలా వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదు కదా బ్రదర్ అంటూ హితవు పలుకుతున్నారు. కాగా, ఈ మధ్య కాలంలో వైఎస్ జగన్ తరచూ బెంగళూరు వెళ్లడం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ తోటి ప్రయాణికుడు…భార్య భారతితో ప్రయాణిస్తున్న జగన్ ఫోటో షేర్ చేయడంతో ఇప్పుడిది నెట్టింట హల్‌చల్ చేస్తోంది.