151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలతో మొన్నటి వరకూ బలంగా కనిపించిన జగన్ పార్టీ..ఇప్పుడు బలహీనపడింది. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఐదేళ్లు తిరిగే సరికి రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీ కూడా ఓడిపోని రీతిలో 11 సీట్లకే పరిమితమయింది. ఇదే అదనుగా కాంగ్రెస్ పార్టీ ఏపీలో బలపడే ప్రయత్నం చేస్తోంది. ఒకప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఏపీలో వైఎస్సార్సీపీ తరఫున ప్రచారం నిర్వహించిన షర్మిల.. ఇప్పుడు పీసీసీ చీఫ్ హోదాలో హస్తం పార్టీని బలోపేతం చేయడానికి వ్యూహాలు రచిస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ కనుమరుగైంది. ఈ క్రమంలో రాష్ట్ర పార్టీపగ్గాలను వైఎస్ షర్మిల చేపట్టారు. దీంతో పార్టీ శ్రేణుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. కానీ ఈ ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి దారుణ ఓటమే ఎదరయింది. గతంతో పోలిస్తే ఓటింగ్ శాతం పెరిగినా..సీట్లు మాత్రం రాలేదు. అయినా వెనకడుగు వేయని షర్మిల.. 2029 ఎన్నికలకు పార్టీని ఇప్పటి నుండే బలోపేతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అందుకు వైఎస్‌ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నారు. ఇప్పటి దాకా వైఎస్ వారసత్వాన్ని, ఆయన ద్వారా వచ్చిన ఓటు బ్యాంకును కాపాడుకున్న జగన్‌కు..ఇకపై గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్నారు షర్మిల. వైఎస్ జగన్, షర్మిల ఇద్దరూ వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులే. కష్టాల్లో ఉన్న అన్నకు అండగా నిలబడటం కోసం రాజకీయాల్లోకి వచ్చిన షర్మిల.. వైఎస్సార్సీపీ విజయం కోసం రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. అయితే అన్నతో దూరం పెరగడంతో కాంగ్రెస్ గూటికి చేరిన షర్మిల.. వైఎస్ తనయగా ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తెచ్చే బాధ్యతను తలకెత్తుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైఎస్సార్సీపీ నుంచి వైఎస్ అభిమానులను గతంలో కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకుగా ఉన్న వర్గాలను తిరిగి హస్తం వైపు తీసుకువచ్చే ప్రయత్నాలు చేపట్టారు. ఈ క్రమంలో తొలి అడుగుగా..తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను షర్మిల ఉపయోగించుకోబోతున్నారు. జులై 8న విజయవాడలో వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు హాజరు కావాలని కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వంటి కీలక నేతలను స్వయంగా ఆహ్వానించారు..షర్మిల.