హైడ్రాతో హైఅలర్ట్..?
కమిషనర్ భద్రత పెంపు..!
హైడ్రా విషయంలో కమిషనర్ రంగనాథ్ దూకుడుగా వెళ్తున్నారా..? పెద్దా,చిన్నా అన్న తారతమ్యం లేకుండా కబ్జాదారుల పనిపట్టేస్తున్నారా..? ఇప్పటికే సిటీలో 44 ఎకరాలకుపైగా కబ్జాల్లో నిర్మించిన పెద్దపెద్ద భవంతులను నేలమట్టం చేసిన ఆయనకు ఓవైపు ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే…సీఎం రేవంత్ డైరెక్షన్‌లో ఆయన చేస్తున్నదంతా పక్షపాతం, దుర్మార్గమని కమిషనర్ రంగనాథ్‌పై కొందరు కక్ష పెంచుకున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయనకు ప్రాణహాని ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్‌కూడా వచ్చాయట. ఈ క్రమంలో రేవంత్ సర్కార్…కమిషనర్ రంగనాథ్‌కు భద్రత మరింత పటిష్టం చేసింది. హైదరాబాద్ మధురానగర్‌లోని ఆయన నివాసం వద్ద ఔట్ పోస్టు ఏర్పాటుచేసి నిరంతరం డేగ కళ్లతో పహారా కాసేలా ఏర్పాట్లు చేసింది.
ఇప్పటికి 44 ఎకరాలు స్వాధీనం..?
డిసాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ.. హైడ్రా…ఈ పేరు భూకబ్జాదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. హైదరాబాద్ మహా నగరంలో చెరువులు, కుంటలను చెరబట్టి, నిర్మాణాలు చేసిన ఫలితంగా వర్షం వస్తే రోడ్లపైకి నడుముల్లోతు వరద వచ్చి చేరుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమై సామాన్యుల జీవితం అస్తవ్యస్తం అవుతోంది. దీనిపై దృష్టిసారించిన రేవంత్ సర్కార్ హైడ్రా అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసి దానికి రథసారిధిగా సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్‌ను ఎంపిక చేసింది. హైడ్రా ఏర్పాటుచేసినప్పటి నుంచి ఇప్పటివరకు 18 చోట్ల ప్రభుత్వ స్థలాల్లో ఉన్న కబ్జాలను తొలగించి సుమారు 44 ఎకరాలపైగా ప్రభుత్వ స్వాధీనం చేసుకుందని గణాంకాలు చెబుతున్నాయి.