మాజీ సిఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని అసెంబ్లీ ఫోబియా ఆవహించిందని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టడం కోసం సాకులు వెదుకుతున్నారని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. చదువు, పరీక్షలంటే భయపడే పిల్లలు మారాం చేసినట్టు జగన్ మాట్లాడుతున్నారని చెప్పారు. సభా సాంప్రదాయాల్లో లేనప్పటికీ తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఆరోపించడం చౌకబారు చర్య అన్నారు. ఆయన పార్టీకి 40 శాతం ఓట్లు వచ్చినా 6.28 శాతం సీట్లు మాత్రమే వచ్చాయన్నారు. 10 శాతం సీట్లు రాక పోవడం వల్ల ఆయనకు ప్రతి పక్ష నాయకుని హోదా ఇవ్వలేదని వివరించారు. దీనిని వక్రీకరిస్తూ 1984లో లోక్ సభలో టిడిపి నేత ఉపేంద్రకు, 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ నేత పి జనార్ధన్ రెడ్డికి 10 శాతం సీట్లు లేకపోయినా ప్రతి పక్ష హోదా ఇచ్చారని తప్పుడు సమాచారం ఇచ్చారని తెలిపారు.
వారు వారి వాదనల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు తప్ప ప్రతి పక్ష హోదా వల్ల కాదని తెలిపారు. రాష్ట్రానికి చెందిన ఎస్ జయపాల్ రెడ్డి, ఎం వెంకయ్య నాయుడు తమ వాక్చాతుర్యం వల్ల జాతీయ స్థాయికి ఎదిగారని చెప్పారు. జగన్ ఆడలేక మద్దెల వోడు అన్న చందంగా శాసన సభ సమావేశాలలో మాట్లాడ లేక సాకులు చెపుతున్నారని ఎద్దేవా చేశారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు టిడిపి నేతగా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి చెప్పడం జగన్ కు తగదన్నారు. ఆయన సిఎం హోదాలో ప్రజల మధ్యకు వెళ్లడానికి భయపడి పరదాలు కట్టుకున్నారని చెప్పారు. ఇప్పుడు సమావేశాలను ఎదుర్కోలేక అసెంబ్లీకి రాకుండా ఉండేందుకు ఎత్తులు వేస్తున్నారని చెప్పారు. ఆయనను తొలి నుంచి భయం ఆందోళనలు వెంటాడుతున్నాయని అన్నారు. ఆయనతో పాటు ఎన్నికైన 10 మంది ఎమ్మెల్యేల్లో ఒకరికి అసెంబ్లీలో మాట్లాడే దమ్ము, తెలివి తేటలు లేవని సుధాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు.