ఏపీలోని వాలంటీర్ వ్యవస్థపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కంటే భిన్నంగా ఈసారి పెన్షన్లను పంపిణీ చేయయనున్నామని, ప్రభుత్వ రంగంలో ఉద్యోగులుగా గుర్తుంచబడిన సచివాలయ సిబ్బందితో జులై 1న పెన్షన్లు అందిస్తామని ఆయన చెప్పారు. అంతేకాదు వాలంటీర్ వ్యవస్థను తాము ఉపయోగించడం లేదని కుండబద్దలు కొట్టేశారు. అంతేకాదు రాజీనామా చేసిన వాలంటీర్లపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని క్లారిటీ ఇచ్చేశారు. ఈ సమాధానంతో మరోసారి వాలంటీర్లను ప్రశ్నార్థకంలో పడేశారు.దీంతో వాలంటీర్లు ఆందోళనకు గురవుతున్నారు.
వైసీపీ నాయకుల చర్యల కారణంగా ప్రస్తుతం వాలంటీర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.టీడీపీ ప్రభుత్వం వాలంటీర్ల కష్టాలను గమనించి వారి గౌరవ వేతనాన్ని రూ.10వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది.ప్రస్తుతం రాజీనామా చేయకుండా అలాగే ఉన్న లక్ష మంది యువతకు నెలకు రూ.10వేల చొప్పున ఏడాదికి రూ.1,20,000 కోల్పోవలసి వస్తుంది. మొత్తంగా ఐదేళ్లపాటు దాదాపు రూ.6లక్షలు తాము కోల్పోవలసి వస్తుందని రాజీనామా చేసిన వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజీనామా చేసిన వాలంటీర్ల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకుంటుందని అందరూ అనుకున్నారు.కానీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు.
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో జులై-1న పెన్షన్ల పంపిణీ చేయాల్సి ఉంది.ఈలోపు వాలంటీర్ల వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందని అందరూ ఆశించారు.ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ తిరిగి మొదలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావించింది.పైగా ఒకేసారి రూ.7వేల రూపాయలు ఇస్తున్నారు కాబట్టి..ఓ భారీ కార్యక్రమంలా పెన్షన్లు పంపిణీ చేయాలనుకుంటున్నారు.దీంతో వాలంటీర్లతో అవసరం పడుతుందని అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు…. వలంటీర్లలో ఆందోళనలు కలిగిస్తున్నాయి. అసలు ఈ వ్యవస్థను కొనసాగిస్తారా లేక నిలిపివేస్తారా అని ప్రశ్నిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వారి కష్టాలను అర్థం చేసుకుని సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నారు.