మైసూరు నగర అభివృద్ధి సంస్థ స్కామ్‌లో సీఎం సిద్ధరామయ్యను విచారించాలని సాక్షాత్తూ కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ అనుమతి ఇవ్వడంపై కాంగ్రెస్ మండిపడింది. ఈ క్రమంలో ఆగస్టు 19న రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చింది. సీఎం సీద్ధరామయ్యను దించేందుకు…బీజేపీ-జేడీఎస్ కలిసి ఆడుతున్న నాటకంగా అభివర్ణించిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్…మన ఆందోళన కార్యక్రమం శాంతియుతంగా జరగాలని, దీన్ని ఆసరాగా చేసుకుని ప్రత్యర్థి పార్టీలు కుట్రపన్ని అల్లరిమూకలను పంపే ప్రయత్నం చేస్తాయని, ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
మరోవైపు రాష్ట్రపతికి వినతిపత్రాలు..!
సీఎం సిద్ధరామయ్యను విచారించాలన్న గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతిఒక్కరూ రాష్ట్రపతి ముర్ముకు వినతిపత్రాలు పంపాలని కర్ణాటక కాంగ్రెస్ నిర్ణయించింది. అందుకు అన్ని జిల్లా, తాలూకా కేంద్రాల్లోని ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేయాలని పార్టీశ్రేణులకు కేపీసీసీ దిశానిర్దేశనం చేసింది.