విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి ఎన్డీయే తప్పుకుంది. వైఎస్ఆర్సీపీ నుంచి సోమవారం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేయగా…మంగళవారానికి నామినేషన్ దాఖలు ప్రక్రియ ముగింపు సమయం దగ్గరపడుతున్న కొద్దీ సంకీర్ణ ప్రభుత్వం నుంచి అభ్యర్థిని ఎప్పుడు ప్రకటిస్తారనేది ఉత్కంఠ రేపింది.
అయితే కూటమి బరిలోకి దిగడం లేదన్న వార్తతో ఆ టెన్షన్‌కు తెరపడింది.
విలువలా? వ్యూహమా?
బాబు సర్కార్ గద్దెనెక్కాక విశాఖ జిల్లా నుంచి చాలా మంది స్థానిక సంస్థల వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు కూటమివైపు అడుగులు వేశారు. కొద్దోగొప్పో గెలిచే సత్తా ఉండికూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో ఉండకపోవడం చంద్రబాబు వ్యూహంతో వెళ్తున్నారా? విలువలు పాటిస్తున్నారా? అనే మీమాంస అందరిలో వెంటాడుతోంది.
త్వరలో బొత్స టీడీపీలోకి..?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు కూటమి అభ్యర్థిని బరిలోకి దింపకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బొత్స గెలిచినా రేపోమాపో పార్టీలోకి ఆహ్వానించి పరోక్షంగా వైఎస్ఆర్సీపీని దెబ్బకొట్టాలన్నది చంద్రబాబు ప్లాన్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవేళ అదే జరిగితే చంద్రబాబు రాజకీయ చతురతకు ఇదొక మచ్చుతునక అని చెప్పకతప్పదు.