మైసూరు నగరాభవృద్ధి సంస్థ స్కామ్‌లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఊరట దక్కింది. ముడా స్కామ్‌లో సీఎం పాత్రపైనా విచారణ జరపాలన్న గవర్నర్ థావర్‌చంద్ ఆదేశాలపై మండిపడ్డ సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఇది నిబంధనలకు విరుద్ధమని, ఆయన పరిధిదాటి వ్యవహరిస్తున్నారని గవర్నర్‌కు వ్యతిరేకంగా సీఎం సిద్ధరామయ్య పిటిషన్ వేయడంతో…విచారించిన హైకోర్టు, తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని లోకాయుక్తను న్యాయస్థానం ఆదేశించింది.
ఇంతకీ ముడా స్కామ్ ఏంటి..?
సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ పేరిట మైసూరు ప్రాంతంలో ఉన్న భూములను అభివృద్ధికోసం ముడా సేకరించింది. పరిహారంగా ఆమెకు మైసూరు-విజయనగరలో స్థలాలు కూడా కేటాయించింది. సీఎం కనుసన్నల్లో ఈ వ్యవహారం అంతా జరిగిందని, సిద్ధరామయ్య ఆదేశాలతో ఆమెకు ఖరీదైన ప్రాంతంలో విలువైన స్థలాలు కట్టబెట్టారన్నది బీజేపీ, జేడీఎస్ ప్రధాన ఆరోపణ. కొందరు సామాజిక కార్యకర్తల ఫిర్యాదు ఆధారంగా సీఎంను విచారించాలని గవర్నర్ ఆదేశాలు జారీచేయడంతో ఇది చట్టవిరుద్ధమని సిద్ధరామయ్య కోర్టు మెట్లుఎక్కడం, మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పార్టీశ్రేణులు ఆందోళనకు దిగడం తెలిసిన విషయమే.