ఆకస్మిక వరద – స్పెయిన్‌లో 200మందికిపైగా మృతి
ఆకస్మిక వరదలతో స్పెయిన్ వణుకుతోంది. దేశంలోని తూర్పు, ఆగ్నేయ భాగాలలో వాలెన్సియా, కాస్టిల్లా లా మంచా, అండలూసియా ప్రాంతాలలో విధ్వంసకర విపత్తుతో సుమారు 205మంది ప్రాణాలు కోల్పోయారని అక్కడి అధికారిక వర్గాలు తేల్చాయి.
మంగళవారం రాత్రి కురిసిన కుంభవృష్టితో వినాశకరమైన ఆకస్మిక వరదలకు దారితీసిందని ఆదేశ జిన్హువా వార్తా సంస్థ ప్రచురించింది.
సోషల్‌మీడియాలో కనిపిస్తున్న విధ్వంస చిత్రాలు స్పెయిన్ పరిస్థితిని తెలియజేస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి. కార్లపై కార్లు ఎక్కి బొమ్మలను తలపించడం, మరోవైపు వంతెనలు కూలిపోవడం, సొరంగాలు కూలిపోవడంతో రైల్వే వ్యవస్థ ప్రశ్నార్థకరంగా మారడం, పొలాలు కొట్టుకుపోడవంతో రైతన్న కళ్లల్లో కనిపిస్తున్న కడగండ్లు..ఇవన్నీ ప్రస్తుతం స్పెయిన్ దుర్భర పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఇళ్లల్లోకి పీకలదాటి వరదొచ్చి విలయతాండవం చేయడంతో ఇళ్ల పైకప్పుకెక్కి కొందరు, కార్లపై కూర్చుని మరికొందరు రోజు వెళ్లదీస్తున్నారు.
సెంటర్ ఫర్ కో ఆర్డినేటెడ్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ నివేదిక ప్రకారం బుధవారం ఉదయం నాటికి స్పెయిన్ వరదల్లో మృతుల సంఖ్య 205కు చేరుకుందని తెలిసింది. అత్యధికంగా వాలెన్సియా ప్రాంతంలో 202 మంది, కాస్టిలా లా మంచాలో ఇద్దరు, అండలూసియాలో మరొకరు మృతిచెందినట్లుగా ఆ నివేదిక సారాంశం.