గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. గ్రామ పంచాయతీల్లో బ్లీచింగ్‌కి కూడా డబ్బుల్లేవు. రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులివ్వకుండా అనేక పథకాలను భ్రష్టు పట్టించారు. కేంద్రం ఇచ్చిన నిధులూ మళ్లించారు. అన్ని అనర్థాలకు, అవకతవకలకు ఒక ఐఏఎస్ అధికారే కారణమని సమీక్ష సమావేశాల్లో చెబుతున్నారు. నాకు తెలిసి ఆయన ఇప్పుడు వెళ్లిపోయారు. వీళ్లందర్నీ ఎలా బాధ్యులను చేయాలనేది సవాల్‌గా మారింది. కేసులు పెట్టొచ్చేమో తెలియదు’ అని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, కమిషనర్ కన్నబాబుతో కలిసి మంత్రి శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు.
‘గ్రామీణ రహదారుల నిర్మాణానికి ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు ఇచ్చిన రుణాన్ని కూడా గత ప్రభుత్వం పూర్తిగా వినియోగించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులివ్వకుండా నిర్లక్ష్యం చేసింది. జల్‌జీవన్ మిషన్ పథకానికీ రాష్ట్ర వాటా నిధులు కేటాయించలేదు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులూ మళ్లించారు. వీటన్నింటినీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కొన్ని వెసులుబాట్లు కావాలని కోరతాం. కేంద్ర పథకాలకు 18% జీఎస్టీ తొలగించాలని, రాష్ట్రం పెట్టాల్సిన వాటాను 30 నుంచి 10 శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేస్తాం. పథకాల పూర్తికి బ్యాంకులు కూడా రుణాలివ్వడానికి ముందుకొస్తున్నాయి. వాటినీ పరిశీలిస్తున్నాం. ఒక్కరోజులో అద్భుతాలు చేయడానికి మా దగ్గర అల్లాఉద్దీన్ అద్భుత దీపం లేదు. పంచాయతీరాజ్ వ్యవస్థలో మార్పు తేవడానికి కొంత సమయం పడుతుంది’ అని పవన్ కల్యాణ్ అన్నారు.