ఆడపడుచులకు పవన్ సారె..!
శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ ఇలాకా పిఠాపురం పాదగయ క్షేత్రంలో ఆగస్టు 30న సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నియోజకవర్గ ఆడపడుచులకు సారె ఇవ్వబోతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సుమారు 12వేలమంది మహిళలకు ఇచ్చేందుకు ఇప్పటికే పవన్ ఫొటోతో కూడిన కిట్స్ సిద్ధం చేశారు. ఈ కిట్ ద్వారా పూజా సామగ్రితోపాటు ప్రతి మహిళకూ చీర ఇవ్వనున్నారు. చివరి శ్రావణ శుక్రవారం సందర్భంగా పిఠాపురం ఆడపడచులకు ఇచ్చే ఈ సారె పూర్తిగా పవన్ తన సొంత ఖర్చని, ఆయనే స్వయంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని జనసేన శ్రేణులు అంటున్నాయి.
చదవండి: నాతోపాటే మస్తాన్..?: మోపిదేవి
పిఠాపురంలో పవన్ మార్క్..?
గడిచిన ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగాగీతను మట్టికరిపించి తనకు ఇంతటి ఘనవిజయాన్ని కట్టబెట్టిన పిఠాపురం ప్రజలకు తన మార్క్ పాలన ఎలా ఉంటుందో చూపిస్తున్నారు జనసేనాని. పవన్‌ను గెలిపిస్తే మీరందరూ హైదరాబాద్ వెళ్లి కలుసుకుని అర్జీలు ఇచ్చే పరిస్థితి వస్తుందని, నాడు అధికార వైఎస్‌ఆర్సీపీ చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ నియోజకవర్గ కేంద్రంలోనే స్థలం కొని పార్టీ ఆఫీస్‌ను, తన క్యాంప్ ఆఫీస్‌ను నిర్మించే ప్రయత్నానికి పూనుకున్నారు. మరోవైపు పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు త్వరలో అపోలో ఆస్పత్రిని పిఠాపురంలో నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. డిప్యూటీ సీఎంగా, నాలుగైదు శాఖలకు మంత్రిగా ఉన్న పవన్…నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదన్న విమర్శలు తలెత్తే ప్రశ్నే లేకుండా… దూరంగా ఉంటున్నా కూడా ఎప్పటికప్పుడు ప్రజాభీష్ట నిర్ణయాలతో ఓటర్ల మనసులో చెరగని ముద్రవేసుకుంటూ తనదైన పాలన సాగిస్తున్నారు.