వైసీపీ సీనియర్ నాయకుడు, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి భారీ షాక్ తగిలింది. ఆయనపై నియోజకవర్గ బహిష్కరణ వేటు వేశారు జిల్లా ఎస్పీ. తాము అనుమతి ఇచ్చే వరకు నియోజకవర్గంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు పెద్దారెడ్డి ఇంటికి నోటీసులు పంపించారు.
తా’ఢీ’పత్రిలో గరం రణం…
వాస్తవానికి ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన ఘర్షణల నేపథ్యంలో పెద్దారెడ్డిపై అనధికార వేటు కొనసాగుతోంది. అయితే పెద్దారెడ్డిపై పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నా ఆయన ఎప్పటికప్పుడు నియోజకవర్గంలోకి వచ్చే ప్రయత్నంచేస్తూ టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల నాలుగురోజుల క్రితం చడీచప్పుడూ కాకుండా ఆయన నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇవ్వడంతో తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. టీడీపీ-వైసీపీ కొట్లాటలో పలువురికి తీవ్రగాయాలు కాగా ఇరువర్గాలకు చెందిన వాహనాలు ఆ ఘర్షణలో తగలబడ్డాయి. ఈ క్రమంలో మళ్లీ పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి అనంతపురానికి పంపేశారు పోలీసులు.
చదవండి: దర్శన్ కు జైల్లో రాచమర్యాదలు, ఫొటో వైరల్
నివేదికతో పెద్దారెడ్డిపై నిర్ణయం..!
అయితే ఫలితాల అనంతరం తాడిపత్రిలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ప్రభుత్వానికి డీజీపీ నివేదిక అందించారు. తాడిపత్రి అంటేనే టీడీపీ-వైసీపీ ఘర్షణలకు కేరాఫ్ అడ్రస్ అని తేల్చిచెప్పారు. అయితే మొన్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన జేసీ అస్మిత్ కుటుంబాన్ని అలాగే ఉంచి…వివాదాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారంటూ పెద్దారెడ్డిపై నియోజకవర్గ బహిష్కరణ వేటు వేయడం గమనార్హం.