తప్పుచేస్తే మా వాళ్లపై కేసులు పెట్టండన్న రోజా..?
సెల్యూట్ చేయించుకునేలా ప్రవర్తించాలని పోలీసులకు రోజా హితవు..!
ఇచ్చిన హామీలను అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్‌తో కూటమి సర్కార్ నెట్టుకొస్తోందని వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. వైసీపీకి చెందిన మహిళలపై నీచంగా పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో తమపై అసభ్యకర పోస్టులు పెట్టిన కూటమి కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని తిరుపతి ఈస్ట్ పీఎస్‌లో మాజీమంత్రులు రోజా, నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్యే భూమన కంప్లైంట్ చేశారు.
తప్పు చేస్తే వైసీపీ శ్రేణులపై కేసులు పెట్టండి… అంతేకానీ, దొంగ కేసులు పెడితే తాము సహించేది లేదన్నారు రోజా. టోపీపై ఉన్న మూడు సింహాలకు సెల్యూట్ చేసేలా ప్రవర్తించాలని పోలీసులకు హితవు పలికారు.
సీఎంగా ఉన్నప్పుడే జగన్‌పై టీడీపీ నీచమైన పోస్టులు పెట్టిందని మండిపడ్డారు రోజా. ఇప్పుడు అధికారంలో కూర్చుని తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై దాడులను ఆపడానికి పోలీసులను వాడాల్సిందిపోయి…తమను అణచివేద్దామని చూస్తే తిరుగుబాటు తప్పదని రోజా హెచ్చరించారు.