మీ పాలనే మాకు ఆదర్శమంటూ పొగడ్త!
ఆనందంలో గులాబీ శ్రేణులు
ఇతర దేశాలనుంచి మంత్రులుకానీ, అధికారులు కానీ వస్తే…సదరు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను కలవడం, వారినుంచి కొన్ని సలహాలు సూచనలు తీసుకోవడం ఆనవాయితీగా వచ్చే ఓ కార్యక్రమం. కాకపోతే ఈ వార్త అందుకు భిన్నం. ఎందుకంటారా…సాక్షాత్తూ శ్రీలంక మంత్రి సదాశివం హైదరాబాద్ రావడం…నేరుగా మాజీ మంత్రి కేటీఆర్‌ను కలిసి గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిపై కొనియాడటం…పైగా మీ పాలనే మాకు ఆదర్శమంటూ కితాబునివ్వడం…ఇప్పుడీ అంశం పాలనలో లేని గులాబీ పార్టీ శ్రేణులకు ఊపునిచ్చింది.
కొత్త ఉత్సహాన్ని తెచ్చిపెట్టిందనే చెప్పాలి.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రేట్ – శ్రీలంక మంత్రి సదాశివం
కేటీఆర్ గారు…నాటి మీ పదేళ్ల పాలనలో రాష్ట్రం అనూహ్య ప్రగతి సాధించింది. గతంలో శ్రీలంక పార్లమెంట్‌లోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించా… పైగా సింగపూర్‌ను తలపించేలా హైదరాబాద్ అభివృద్ధి ఉందని, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్…తెలంగాణను పెట్టుబడులకు కేరాఫ్‌గా మార్చారన్న విషయాన్ని ప్రస్తావించానని కేటీఆర్‌కు ఆయన గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పెరుగుతుంటే రాష్ట్రాన్ని అవకాశాల అక్షయపాత్రగా మార్చారంటూ కేటీఆర్‌ను కలిసి నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు సదాశివం.