సుప్రీంకోర్టు ఇచ్చిన హామీపై దేశవ్యాప్తంగా వైద్యులు మెత్తబడ్డారు. సమ్మె విరమించాలంటూ ధర్మాసనం చేసిన విజ్ఞప్తికి ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ తలొగ్గింది. ఈ మేరకు సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించింది. దేశవ్యాప్త ఆందోళనలతో అభయ కేసును సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు గురువారం మరోసారి విచారణ చేపట్టింది. అయితే ఈ ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ అభయ చనిపోయిన నాటినుంచి నేటివరకు విధులను బహిష్కరించి ఆందోళనలు చేస్తున్న తరుణంలో సుప్రీం ధర్మాసనం వారిని ప్రశ్నించింది. వైద్యులు లేకుంటే ప్రజారోగ్య వ్యవస్థ ఎలా నడుస్తుందని…మీ ఆందోళనల కారణంగా పేదలు నష్టపోకూడదని వ్యాఖ్యానించింది. ఆందోళన చేస్తున్న మీ అందరిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా మేం చూస్తామంటూ కోర్టు హామీ ఇవ్వడంతో… సమ్మె విరిమించి విధుల్లో చేరేందుకు వైద్యులు అంగీకారం తెలిపారు.
హత్యాచార జ్వాల చల్లారేనా..?
ఓ వైపు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన హామీతో సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు వైద్యులు సిద్ధమవ్వగా…మరోవైపు నిందితులకు శిక్షపడాలి, బాధిత కుటుంబానికి న్యాయం జరగాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు ఎవరికి వారు, ఎక్కడకక్కడ తమ నినాదాలతో నిరసన కార్యక్రమాలను చేపడుతూ వస్తున్నారు. వైద్యులు వెనక్కి తగ్గినా వీరు తగ్గకపోవడంతో అభయ హత్యాచారంతో రగిలిన ఈ జ్వాల…ఇప్పట్లో చల్లారేలా లేదు.