ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు టీడీపీ నేతలు, వ్యాపారవేత్తలపై ఉన్న కేసులన్నీ సీబీఐ, ఈడీలకు అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టులో ప్రజాప్రయోజనవ్యాజ్యం దాఖలైంది. స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ కొట్టి బాలగంగాధర్ తిలక్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేశ్, పొంగూరు నారాయణ, కింజారపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, వ్యాపారవేత్తలు లింగమనేని రమేశ్, వేమూరు హరికృష్ణ సహా మొత్తం 114 మందిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్ కుమార్ గుప్తాను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా పేర్కొన్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం, మద్యం కుంభకోణం, ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణం, అసైన్డ్ భూముుల కుంభకోణం, ఇసుకు కుంభకోణం, ఇన్నర్ రింగు రోడ్ అలైన్‌మెంట్‌లో అక్రమాలు తదితర స్కామ్‌లకు సంబంధించి దర్యాప్తు బాధ్యతలను సీబీఐ, ఈడీలకు అప్పగించాల్సిన అవసరం ఉందన్నారు. నిష్పాక్షిక, పారదర్శక, వేగవంతమైన దర్యాప్తు కోసం కేసులను సీబీఐ, ఈడీకి అప్పగించాలని అభిప్రాయపడ్డారు. ‘‘ఫలితాలు వెలువడిన రోజున డీజీపీగా, పోలీసు బలగాలకు అధిపతిగా ఉన్న హరీశ్ కుమార్ గుప్తా సీఐడీలోని ఆర్థిక నేరాల విభాగానికి తాళాలు వేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి, ఇతర టీడీపీ నేతలపై నమోదైన కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారులకు ప్రవేశాన్ని నిరాకరించారు. చంద్రబాబు తదితరులు అధికారంలోకి వస్తున్నారని గ్రహించి, ఆయా కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అంతేకాక, మధ్యాహ్నం 12.30 గంటలకు రహస్యంగా సాయుధులను అక్కడ మోహరించారు. కౌంటింగ్ జరుగుతుండగానే ఆర్థిక నేరాల విభాగం నుంచి అధికారులందరినీ వెళ్లిపోమ్మన్నారు. ఈ విషయాలన్నీ పత్రికల్లో వచ్చాయి. ఓ డీజీపీ ఈ విధంగా చేయడం చట్టవిరుద్ధం, ఏకపక్షం, దౌర్జన్యపూరితం’’ అని పిటిషనర్ తిలక్ పేర్కొన్నారు.
ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచీ డీజీపీ, సీఐడీ అదనపు డీజీ తదితరులందరూ కూడా ఈ కేసుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని తిలక్ వివరించారు. ఈ కేసుల్లో సీఐడీ, ఈడీ ఇప్పటివరకూ చేసిన దర్యాప్తును చంద్రబాబు, ఇతర నేతలకు అనుకూలంగా నీరు గార్చేలా వ్యవహరిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో హైకోర్టు ఈ కేసుల దర్యాప్తును సీబీఐ, ఈడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోరారు. ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ అప్పటి ఎండీ హోదాలో డి. వాసుదేవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసిందని తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వాసుదేవరెడ్డిపై కేసు నమోదు చేశారన్నారు. ఇసుక కుంభకోణంపై ఫిర్యాదు చేసినందుకు గనుల శాఖ అప్పటి డైరెక్టర్ జి.వెంకట రెడ్డిపై కక్ష తీర్చుకుంటున్నారన్నారు. తమపై ఫిర్యాదు చేసిన వారందరిపై చర్యలు తీసుకుంటామని రెడ్ బుక్ పేరిట పలువురు అధికారులను వేధిస్తున్నారని తెలిపారు. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని ఆయన కోర్టును కోరారు.