ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. బుధవారం నాడు 75,109 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 30,285 మంది తలనీలాలు సమర్పించారు.
తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.40 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 13 కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్లమెంట్లల్లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు అల్పాహారం, మంచినీళ్లు, పాలు పంపిణీ చేశారు. శ్రావణ మాసంలో విశేష పూజలను దృష్టిలో ఉంచుకుని భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
నేడు శ్రీవారి భక్తుల కోసం టీటీడీ అధికారులు అంగప్రదక్షిణ టోకెన్లను జారీ చేయనున్నారు. ఈ మధ్యాహ్నం 12 గంటలకు ఆన్‌లైన్ ద్వారా వాటిని విడుదల చేస్తారు. ఈ కోటా కింద అందుబాటులోకి తీసుకొచ్చే టికెట్ల సంఖ్య.. 250. ఈ టికెట్లను పొందిన భక్తులు శనివారం అంటే ఆగస్టు 10వ తేదీ తెల్లవారుజామున అంగ ప్రదక్షిణ చేయవచ్చు.భక్తులు తడివస్త్రాలతో శ్రీవారికి అంగప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో సంప్రదాయ దుస్తులను ధరించాల్సి ఉంటుంది. అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటిగంటకు వైకుంఠం మొదటి క్యూ కాంప్లెక్స్ వద్దకు భక్తులు రిపోర్ట్ చేయాలి. అక్కడ వారి టికెట్లు, గుర్తింపుకార్డులను టీటీడీ సిబ్బంది తనిఖీ చేస్తారు. ఆ తరువాతే ఆలయం లోనికి వెళ్లడానికి అనుమతిస్తారు.
శ్రీవారి సుప్రభాత సేవ ఆరంభమైన తరువాత భక్తులకు అంగప్రదక్షిణకు అనుమతి ఇస్తారు. సుప్రభాత సేవ కొనసాగుతున్న సమయంలో తెల్లవారుజామున 2:45 నిమిషాలకు తొలుత మహిళలు, అనంతరం పురుషులు అంగప్రదక్షిణానికి పంపుతారు. స్వామివారి బంగారు వాకిలి ముందు నుంచి అంగప్రదక్షిణ చేస్తూ ఆలయం ఆవరణలోని హుండీ వరకు వెళ్లాలి.