ఉత్తరాఖండ్‌లో ఘోరం..!
బస్సు లోయలో పడి 36మంది శివైక్యం..!
కార్తీకమాసం తొలిసోమవారం దేవభూమి ఉత్తరాఖండ్‌లో ఘోరం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో, ప్రయాణిస్తున్నవారిలో 36 మంది చనిపోయారు. హుటాహుటిన ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక సమాచారం.
ఆర్మోరా జిల్లా అధికారుల వివరాల ప్రకారం గర్వాల్ నుంచి కుమావూ వెళ్తున్న బస్సు మార్చులా వద్ద అదుపుతప్పింది. రోడ్డు పక్కనే ఉన్న 200 అడుగులు ఉన్న లోయలో పడిపోయింది. ఆ క్షణంలో అక్కడికక్కడే 20మంది మృతిచెందగా, తీవ్రగాయాలపాలైన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. వీరిలో పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరో 16మంది కన్నుమూశారు. కాగా, ఈ ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4లక్షల చొప్పున, అలాగే క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున సాయం ప్రకటించారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రమాదంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేసింది.