సంచలన నిర్ణయాలు తీసుకున్న టీటీడీ..?
ఇకపై శ్రీవాణి ట్రస్ట్ పేరు రద్దు..!
సోమవారం జరిగిన టీటీడీ బోర్డు సమావేశం పలు కీలక నిర్ణయాలకు వేదిక అయింది. తిరుమల అన్నమయ్య భవన్ వేదికగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు..సర్వత్రా చర్చకు దారితీశాయి. శ్రీవాణి ట్రస్టు పేరు రద్దు చేస్తున్నట్టు స్వయానా బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడే వెల్లడించడం ఇక్కడ ఆసక్తి కలిగించే పరిణామం.
అంతేకాదు, టీటీడీ అన్యమత ఉద్యోగస్తులను ప్రభుత్వానికి బదిలీ చేస్తామని బీఆర్ నాయుడు తెలిపారు.
తిరుపతి శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ పేరును గరుడ వారధిగా మార్చామని వెల్లడించారు. ప్రైవేటు బ్యాంకుల్లో ఉన్న టీటీడీ నగదును ప్రభుత్వ బ్యాంకుల్లోకి బదిలీ చేయాలని నిర్ణయించినట్టు బీఆర్ నాయుడు పేర్కొన్నారు. గత ప్రభుత్వం శారదా పీఠానికి కేటాయించిన స్థలాన్ని తిరిగి తీసుకుంటున్నట్టు చెప్పేశారు. టూరిజం శాఖ ద్వారా ఇచ్చే దర్శన టికెట్లు ఇకపై ఉండబోవన్న ఆయన…కొత్తగా నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్‌కు అనుమతి రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే, ఇకపై తిరుమలలో రాజకీయాలు మాట్లాడకుండా పటిష్ట చర్యలు చేపడతామని తెలిపారు.
తిరుపతి ప్రజలకు ప్రతినెలా తొలి మంగళవారం దర్శనానికి అవకాశం కల్పించేలా… ఇకపై 2 నుంచి 3 గంటల్లోపే భక్తుడికి సర్వదర్శనం పూర్తయ్యేలా నిర్ణయం తీసుకుంది టీటీడీ. డంపింగ్ యార్డులోని చెత్తను మూడు నెలల్లో తొలగించేలా చర్యలు తీసుకుంటామన్న టీటీడీ ఛైర్మన్ నాయుడు…బోర్డు సమావేశంలో భాగంగా టీటీడీ 2025 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.