మరో సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన ఉదయనిధి..!
దయచేసి హిందీ భాషను రుద్దకండంటూ హితవు..!
తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోమారు దేశవ్యాప్త వార్తల్లో నిలిచారు. మొన్నామధ్య సనాతన ధర్మంపై నోటికొచ్చినట్టు మాట్లాడిన ఆయన…ఈసారి హిందీ భాష గురించి ప్రస్తావించారు. దేశంలో ప్రస్తుతం ప్రాంతీయ భాషలకు రక్షణ చాలా అవసరం ఉందంటూ చెప్పొకొచ్చారు. హిందీ భాషకు తమిళనాడు వ్యతిరేకం కాదన్న ఆయన… దాన్ని బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. మనోరమ డెయిలీ గ్రూప్ నిర్వహించిన ఆర్ట్ అండ్ లిటరేచర్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ఆయన…బలవంతంగా భాషను రుద్దడానికి వ్యతిరేకంగా పుట్టికొచ్చినవే ద్రవిడ ఉద్యమాలంటూ వివరించారు.
హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో ఇప్పటికే కొంతమంది జాతీయవాదులు ఆ భాషను బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తున్నారంటూ పరోక్షంగా బీజేపీపై ఆరోపణాస్త్రాలు సంధించారు. ప్రాంతీయ భాషలను, సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం మనందరికీ ఉందని, దీనికోసం ఐక్యంగా పోరాడాల్సి ఉందని నొక్కిచెప్పారు ఉదయనిధి.
అంతేకాదు, దక్షిణాది తరహాలో ఉత్తరాదిన సినీపరిశ్రమలు పెద్దగా లేకపోవడం అతిపెద్ద మైనస్ అయిందని అభిప్రాయపడ్డారు. ఉత్తరాధిలోని ప్రాంతీయ భాష కలిగిన రాష్ట్రాలు వాళ్లవాళ్ల భాషలను పరిరక్షించుకోకుంటే ఆ స్థానంలో హిందీని రుద్దే ప్రయత్నాలు చేసేస్తారని, కచ్చితంగా వారుకూడా మేలుకోవాల్సిన అవసరం ఉందంటూ ఆందోళన వ్యక్తంచేశారు. తమిళ భాషను, సంస్కృతిని, సాహిత్యాన్ని ద్రవిడ నాయకులైన అన్నాదురై, కరుణానిధిలాంటి వారు కాపాడుకొచ్చారని, అందుకే ప్రజల్లో వారికి అంత మంచి పేరని తమిళనాడు డిప్యూటీ సీఎం కరుణానిధి గుర్తుచేశారు.