అగ్రరాజ్యంలో మంగళవారమే పోలింగ్..!
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిపోయింది. మరికొన్నిగంటల్లో ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూసే అగ్రరాజ్యం పోలింగ్ జరగబోతుంది. అమెరికా వ్యాప్తంగా దాదాపు సుమారు 25 కోట్లమంది ఓటర్లు ఉండగా, ముందస్తు ఓటింగ్ ద్వారా ఇప్పటికే సుమారు ఏడున్నర కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. సోమవారం రాత్రితో ప్రచారం ముగియనుంది. ఈ క్రమంలో ఓ వైపు ట్రంప్, మరోవైపు కమలా హ్యారిస్ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజిబిజీగా ఉన్నారు. ఇప్పటికే పలు సర్వేలు ఇచ్చిన నివేదికలను బట్టి చూస్తే ఈసారి విజయం ఎవరికీ అంత వీజీ కాదు, మాంచి టఫ్ పైట్ జరగబోతుందనేది తెలుస్తోంది.
అధ్యక్షుడి ఎన్నికలకు కీలకంగా భావించే స్వింగ్ స్టేట్స్‌లో ట్రంప్-కమలా మధ్య నువ్వా నేనా? అన్నట్టుగా పోటీ ఉన్నట్టు ఒపీనియన్ పోల్స్‌లో వెల్లడైంది. ఈ రాష్ట్రాల్లో ది న్యూయార్క్ టైమ్స్ – సైనా పోల్స్ సర్వే చేపట్టగా…ఇందులో విస్కాన్సిన్, నార్త్ కరోలినా, నెవెడాలో కమలకు మద్దతు ఉంటే…అరిజోనాలో ట్రంప్ వైపు ఓటర్లు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, పెన్సిల్వేనియా, జార్జియా, మిషిగన్‌లో ట్రంప్, కమలా మధ్య టఫ్ ఫైట్ ఉండనుంది సమాచారం. కాగా, ప్రధానంగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్యే పోటీ ఉండనుండగా….అమెరికా అధ్యక్ష పదవి రేసులో పలువురు స్వతంత్ర అభ్యర్థులూ బరిలో నిలవడం విశేషం.