మాజీ ఎంపీ గోరంట్ల వ్యాఖ్యలపై వాసిరెడ్డి పద్మ సీరియస్..!
పోక్సో కింద కేసు నమోదుచేయాలన్న వాసిరెడ్డి పద్మ
ఇటీవలే వైసీపీని వీడిన మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ…మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై కంప్లైంట్ చేశారు. అత్యాచార బాధితురాళ్ల పేర్లను మాధవ్ వెల్లడించారన్నది ఆమె ఆరోపణ. ఈ మేరకు విజయవాడలోని సీపీ రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశారు.
కామాంధుల కాటుతో అఘాయిత్యానికి బలైన వారి పేర్లను బయటకు చెప్పడం దుర్మార్గం, కనీసం ఇంగితజ్ఞానం కూడా లేకుండా వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ బాధితుల పేర్లను చెప్పడం సిగ్గుచేటు. విజయవాడ సీపీని తాను కలిసానని, గోరంట్లపై కంప్లైంట్ ఇచ్చానని, త్వరితగతిన మాధవ్‌పై చర్యలు తీసుకోవాలన్నది తన డిమాండ్‌గా మీడియాకు చెప్పుకొచ్చారామె. అంతేకాదు, గోరంట్ల వ్యాఖ్యలను సమర్థిస్తూ వాళ్ల పార్టీ ఛానల్‌లో కూడా ప్రసారం చేశారు, సదరు ఛానల్‌పై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పానని అన్నారు వాసిరెడ్డి పద్మ.
గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలపై ఇప్పటికే సైబర్ క్రైమ్‌వారికి కూడా కంప్లైంట్ చేశానన్న పద్మ….బాధితుల పట్ల దుర్మార్గంగా మాట్లాడిన ఆయనపై పోక్సో కింద కేసు ఫైల్ చేయాలని, ఈ మేరకు పోలీసులకు కంప్లైంట్ చేశానని తెలిపారు వాసిరెడ్డి పద్మ.
కేశినేని చిన్ని ఆప్తుడన్న వాసిరెడ్డి పద్మ..!
నాటి వైసీపీ గవర్న్‌మెంట్‌లో మహిళా కమిషన్ ఛైర్మన్‌గా పదవి పొందిన వాసిరెడ్డి పద్మ…నాలుగు నెలలు గడువు మిగిలి ఉండగానే ఆ పదవికి గుడ్ బై చెప్పేశారు. మరోవైపు జూన్ నెలలో ఫలితాలు అనంతరం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన వేళ, వైసీపీకి రాం రాం చెప్పేశారు వాసిరెడ్డి పద్మ. అంతేకాదు, పార్టీ నుంచి బయటకు వచ్చేస్తూ జగన్‌ను దుమ్మెత్తిపోశారు. తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఆమె వైసీపీని వీడారు కానీ ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీలో చేరేది తేలలేదు. ఆమె చెప్తున్న మాటల ప్రకారం విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తనకు అత్యంత ఆప్తుడంటూ మెల్లగా రివీల్ చేశారు. మరోవైపు తాను ఏ పార్టీలో జాయిన్ అయ్యేది వారంలోగా చెప్తానంటూ మీడియా ముఖంగా వెల్లడించారు. దీంతో ఇంకేముంది, అధికారంలో ఉన్న టీడీపీలోనే ఆమె చేరుతారంటూ చాలాచోట్ల గాసిప్స్ వినిపిస్తున్నాయి.