ఏపీలో మరో ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. త్వరలో స్థానిక సంస్థల కోటా విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి ఆగస్టు 6న నోటిఫికేషన్ విడుదల కానుండగా,ఆగస్టు 30న ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికను ఇరు పార్టీలు కూడా ప్రతీష్టాత్మకంగా తీసుకున్నాయి. విశాఖలో స్థానికంగా వైసీపీ పూర్తి మెజార్టీతో కనిపిస్తోంది.విశాఖలో మొత్తం ఓట్లు 841 ఉండగా.. అందులో వైసీపీ బలం 615 ఉంది.. టీడీపీ, జనసేన, బీజెపీ సభ్యులకు కేవలం 215 ఓట్లు మాత్రమే ఉన్నాయి.
వైసీపీ నేతలను టీడీపీలోకి తీసుకురావడానికి ఆ పార్టీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలంటే ఇంత తక్కువ సమయంలో జరిగే పని కాదు. భారీ సంఖ్యలో వైసీపీ నుంచి చేరికలు ఉంటే తప్ప , టీడీపీ కూటమి విజయం సాధించే పరిస్థితి లేదు. మరోవైపు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా సీనియర్ నేత బొత్స సత్యనారాయణను వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఖరారు చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బొత్స మాత్రమే నెగ్గుకురాగలరనే అంచనాతో ఆయన పేరును జగన్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
టీడీపీ నుంచి పీలా గోవింద్ పేరు దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది.రాజకీయంగా అనుభవజ్ఞుడు, ఆర్థికంగా బలంగా ఉండటంతో అవకాశం ఇవ్వాలని టీడీపీ అధిష్టానం నిర్వహించినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన వైసీపీ , స్థానిక ఎన్నికల్లో మాత్రం సత్తా చాటుతోంది. విజయవాడ , కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి అధికార పార్టీలకు గట్టి షాక్ ఇచ్చింది. ఈ ఎన్నికలో గెలిచి మరోసారి తమ సత్తా చాటాలని వైసీపీ నేతలు ప్రయత్నిస్తుండగా, వైసీపీ దూకుడుకు బ్రేక్ వేయాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. మరి విశాఖలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.