అవనిగడ్డ నియోజకవర్గంలో రైతాంగానికి ఇబ్బందులు లేకుండా సాగునీరు చివరి భూముల వరకు సక్రమంగా అందించాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ (Mandali buddha prasad) ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం అవనిగడ్డ లోని బుద్ధప్రసాద్ ఇంటివద్ద ఇరిగేషన్, డ్రైనేజీ, రివర్ కన్జర్వేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రకాశం బ్యారేజీ, పులిచింతల, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులలో నీటి నిల్వల గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వస్తుందని ముందుగా తెలిసినప్పటికీ ఖరీఫ్ పనులు ప్రారంభానికి ముందుగా పంట కాలువలలో మరమ్మత్తులు ఎందుకు నిర్వహించలేదని, ముందుగా టెండర్లు ఎందుకు పిలువలేదని ఇరిగేషన్ అధికారులను ప్రశ్నించారు. రానున్న ఖరీఫ్ సీజన్లో ప్రతి ఎకరాకు సాగునీరు సక్రమంగా అందించాలని అన్నారు. ఇరిగేషన్ శాఖ ఎస్ఈ ప్రసాద్ బాబు మాట్లాడుతూ ప్రాజెక్టులలో నీటి లభ్యత చాలా తక్కువగా ఉందని అన్నారు. కృష్ణానదిలో ఇంతవరకు నీటి ప్రవాహం ఎక్కడా లేదని అన్నారు. పులిచింతల ప్రాజెక్టులో డెడ్ స్టోరేజి కంటే తక్కువ నీరు 0.4 టిఎంసి ల నీరు మాత్రమే ఉందని, ప్రకాశం బ్యారేజీలో త్రాగునీటి కోసం నిల్వ ఉంచిన 2 టీఎంసీ ల నీరు మాత్రమే ఉందని తెలిపారు.
గోదావరి నదిలో నీటిమట్టం పెరిగితే పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టా కు సాగునీరు అందిస్తామని తెలిపారు. వర్షాభావ పరిస్థితులు కూడా ఈ ఏడాది బాగానే ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖను పూర్తిగా విస్మరించిందని, నిధుల లేమితో పనులు కూడా చేయలేని విధంగా ఇరిగేషన్ శాఖ తయారైందని అన్నారు. నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా పనులు చేయాలంటే ప్రస్తుతం చేయలేమని, వేసవి కాలంలో చేయాల్సిన పనులు ఇప్పుడు చేయడం కష్టమని అన్నారు. రానున్న రోజులలో గోదావరి జలాలు పెరిగితే పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు రక్షణ అన్నారు. ఇటువంటి భిన్నమైన పరిస్థితులలో తాత్కాలిక ఏర్పాట్లు చేసి సాగునీటిని సక్రమంగా అందించాలని ఇరిగేషన్ అధికారులను కోరారు. అవసరమైతే గతంలో చేసినట్లుగా ఇరిగేషన్, రెవిన్యూ, పోలీస్ శాఖలను సమన్వయం చేసి రైతాంగానికి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ ఎస్ ఈ ప్రసాద్ బాబు, ఇరిగేషన్ ఈ ఈ పి.వి.ఆర్ కృష్ణారావు, డ్రైనేజీ శాఖ గుడివాడ డివిజన్ ఈ ఈ విజయలక్ష్మి, ఆర్ సి డి.ఈ భానుబాబు, ఇరిగేషన్ డిఈ రవికిరణ్, డ్రైనేజీ డీఈ పి.వెంకటేశ్వరరావు, ఏ ఈ లు పాల్గొన్నారు