రాష్ట్రంలో వన్య ప్రాణులను, జంతువులను వేటాడి, అక్రమ రవాణా చేసేవారిపై ఉపేక్షించవద్దని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ, అటవీ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లాలోని విజయపురి సౌత్ రేంజ్ అటవీ పరిధిలో వన్య ప్రాణి అలుగు (పంగోలియన్)ను వేటాడి అక్రమ రవాణా చేసే ముఠాను అదుపులోకి తీసుకొనేటప్పుడు అటవీ శాఖ ఉద్యోగులపై దాడి ఘటనపై మంగళవారం ఉదయం ఆరా తీశారు.
చదవండి: ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్ పిటిషన్… స్పీకర్ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు
వన్య ప్రాణులను, అటవీ సంపదకు నష్టం కలిగించినా, అక్రమ రవాణా చేసినా, ఉద్యోగులపై దాడులు చేసినా చట్టపరంగా కఠిన చర్యలలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సోమవారం అరణ్య భవన్ లో నిర్వహించిన గ్లోబల్ టైగర్ డే కార్యక్రమంలో తను చదువుకొనే రోజుల్లో ఒంగోలులో అలుగును కొందరు వ్యక్తులు కొట్టి చంపడం జరిగిందనే విషయాన్ని ప్రస్తావించానని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరోసారి ప్రస్తావించారు. విజయపురి సౌత్ అధికారులపై దాడి ఘటనపై పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఫోన్లో మాట్లాడారు. ఘటన పూర్వాపరాలను తెలుసుకున్నారు. ఉద్యోగులపై దాడి చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అటవీ ప్రాంత పరిసరాల్లోని ప్రజలకు అటవీ, వన్యప్రాణి సంరక్షణ చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు.