కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో మెడికో హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా పట్టికుదిపేస్తున్న వేళ…సీబీఐ విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ఇచ్చిన వాంగ్మూలంపై సంతృప్తి చెందని అధికారులు నిందితుడికి లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు.
సంజయ్‌కు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించాలంటే ముందుగా కోర్టును ఆశ్రయించి అనుమతి పొందాలి, అయితే ఇప్పటికే ఆ ప్రక్రియను ప్రారంభించారని తెలుస్తోంది.
హత్యాచారంపై విచారణ….అలా మొదలైంది..!
ఆగస్టు 9న రాత్రి ఆర్‌జీ కర్ ఆస్పత్రిలోని సెమినార్ రూమ్‌లో 31 ఏళ్ల మహిళా వైద్యురాలిపై హత్యాచారం జరిగింది. ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా నిరసన జ్వాల ఎగసిపడింది. ఆ మరుసటి రోజే నిందితుడు సంజయ్ రాయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడీ వ్యవహారం సీబీఐ చూసుకుంటుంది. డాక్టర్లు, పోలీసు అధికారులతోపాటు పలువురు అనుమానితులతోసహా మొత్తం 40 మందితో కూడిన జాబితాను సిద్ధం చేసి రోజువారీ విచారణ మొదలు పెట్టింది. తొలిరౌండ్ విచారణలో ఆస్పత్రి వైద్యుడు ఘోష్ నుంచి అనేక సందేహాలకు సమాధానాలు రాబట్టారని తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకు 13 మందిని ప్రశ్నించామని విచారణాధికారిలో ఒకరు తెలిపారు.