ఆమరావతి: మరికొన్ని రోజుల్లో వినాయక చవితి పండగ రానున్న నేపథ్యంలో వేడుకల్ని పర్యావరణహితంగా చేసుకోవాలని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. వినాయక చవితి రోజున మట్టి వినాయకుడినే పూజించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు పవన్ ఆదేశించారు. పిఠాపురంలో మట్టి వినాయకుడి విగ్రహాలతోనే పూజలు జరిపేలా ఏర్పాటు చేయాలని సూచించారు.
మన వేడుకలు, ఉత్సవాల్లో పర్యావరణహిత వస్తువులను వాడటం మేలు. వినాయక చవితి వేడుకల్లో మట్టి గణపతిని పూజిస్తే పర్యావరణానికి ప్రయోజనం కలుగుతుంది. ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గేలా ప్రజలకు అవగాహన కల్పించాలి. దేవాలయాల్లో ప్రసాదాన్ని బటర్ పేపర్‌తో చేసిన కవర్లలో ఇవ్వడం సరికాదు. ప్రసాదాల పంపిణీకి ప్లాస్టిక్ కవర్లను కాకుండా తాటాకు బుట్టలు, ఆకుల దొన్నెలు వాడాలి. ఈ తరహా ప్రయోగం పిఠాపురం ఆలయాల నుంచే మొదలుపెట్టాలి”అని అధికారులకు పవన్ కల్యాణ్ సూచించారు.