దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఊరూవాడా ఘనంగా నిర్వహిద్దామని వైయస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జూలై 8వ తేదీన( సోమవారం) వైయస్ఆర్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించాల్సిన కార్యక్రమాలపై పార్లమెంటు సభ్యులు, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, నియోజకవర్గాల ఇన్చార్జిలతో సజ్జల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ఆయన పలు సూచనలు చేశారు.
మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏటా చేస్తున్నట్టుగానే పలు సేవాకార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవైయస్ఆర్ విగ్రహాలును శుభ్రం చేయాలని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.
దివంగత నేత వైయస్ఆర్‌కు ఘన నివాళులర్పించడంతో పాటు ఏటా చేస్తున్నట్టుగానే సేవా కార్యక్రమాలు చేయాలని పేర్కొన్నారు. ఈ దఫా 75వ జయంతి కావడం ప్రత్యేకత సంతరించుకుందన్నారు. ఆయన మరణించి 15 సంవత్సరాలైనా… ఆయన జ్ఞాపకాలు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు.