అక్రమాస్తుల కేసులో విచారణ వాయిదా
తెలంగాణ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. జగన్‌పై ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్న హరిరామ జోగయ్య పిల్ విచారణకు వచ్చింది. ప్రజా ప్రతినిధుల కేసులను త్వరిత గతిన విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఇప్పటికే జగన్‌తోపాటు సీబీఐకి నోటీసులు జారీచేసిన తెలంగాణ హైకోర్టు…ఈ కేసు విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది.
విచారణలు…వాయిదాలు..!
జగన్ కేసు సాగుతోంది ఇలా…
జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో ఈ మధ్యే ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు విచారణ నుంచి జస్టిస్ సంజయ్ కుమార్ తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. అయితే, జగన్ అక్రమాస్తులకు సంబంధించి నమోదైన సీబీఐ కేసుల్లో తీర్పు వెలువడిన తర్వాతే, ఈడీ కేసుల్లో తీర్పు ఇవ్వాలని ఇప్పటికే తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. సీబీఐ, ఈడీ కేసులను విడివిడిగా లేదా సమాంతరంగా విచారించినా ఆ పద్థతినే అనుసరించాలని నాడే స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును గతేడాది మే నెలలో సుప్రీంకోర్టులో ఈడీ సవాల్ చేయగా… ఆగస్టు 14న ఈడీ పిటిషన్లపై అత్యున్నత స్థానంలో విచారణ జరిగింది.