అన్న జగన్‌కు చెల్లి షర్మిల స్ట్రాంగ్ కౌంటర్..!
అందరి ఇళ్లల్లో మాదిరిగానే తమ కుటుంబంలోనూ గొడవలు వచ్చాయని తేలిగ్గా మాట్లాడిన అన్న జగన్‌పై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు పీసీసీ చీఫ్ షర్మిల. ఇలాంటి గొడవలన్నీ సర్వసాధారణమని చెప్పే మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి…ఎవరూ తల్లి, చెల్లిపై కోర్టుల్లో కేసులు వేయరు కదా అని జగన్‌కు సూటి ప్రశ్న సంధించారు. తండ్రి వైఎస్‌ఆర్ సంపాదించిన ఆస్తుల్లో తనతోపాటు తన పిల్లలకూ వాటా ఉంటుందన్నది వైఎస్ షర్మిల ప్రధాన డిమాండ్. తమకు అరకొర ఆస్తులిచ్చి ఇంట్లోంచి వెళ్లగొట్టేలా జగన్ చూస్తున్నారని మీడియా వేదికగా బాహాటంగానే ఆరోపణలు గుప్పించారు వైఎస్ షర్మిల.
ప్రేమతో జగన్ ఇస్తే ఇన్ని ఆరోపణలా: పేర్నినాని
వైఎస్ఆర్ సంపాదించిన ఆస్తులన్నీ చట్టప్రకారం జగన్‌కు, అతని చెల్లి షర్మిలకు ఏనాడో బదలాయింపులు జరిగాయన్నారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని. అయితే, జగన్ తనకు తాను సంపాదించుకున్న స్వార్జిత ఆస్తుల్లో షర్మిలకు ఎక్కడా ఇవ్వాల్సిన అవసరం లేదని, అయినా చెల్లిపై ప్రేమతో తాను సంపాదించుకున్న ఆస్తుల్లోనూ 40శాతం జగన్ ఇచ్చిన విషయాన్ని ప్రెస్‌మీట్ పెట్టిమరీ డాక్యుమెంట్లను చూపిస్తూ వివరించే ప్రయత్నం చేశారు పేర్నినాని. అయితే టీడీపీ, కాంగ్రెస్ కుట్రపన్నిన కేసులో అన్న జగన్ ఆస్తులను అటాచ్ చేసే క్రమంలో ఒడిదుడుకులు వచ్చాయన్న విషయాన్ని గ్రహించకుండా…ప్రేమతో అన్న ఇచ్చిన కానుకలపై కూడా షర్మిల ఇలా మాట్లాడటం తగదని హితవుపలికారు.