మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీపై ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్‌లు ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు నడుపుతున్నారన్నారు, ప్రతిరోజూ వైయస్.జగన్మోహన్‌రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు తమ అనుకూల మీడియాతో విష ప్రచారాలు చేస్తున్నారని నాని మండిపడ్డారు. సూపర్ సిక్స్ సహా ఇచ్చిన హామీలనుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఫేక్ న్యూస్‌ను సృష్టిస్తున్నారు. చంద్రబాబుకు ఎంతమందితో సెక్యూరిటీ ఇస్తున్నారో బయటపెట్టే దమ్ముందా అని ఆయన ప్రశ్నించారు. జగన్ గారికి మొత్తం 196 మంది సెక్యూరిటీ ఉంటే 986 మంది అని ఎలా రాస్తారని నిలదీశారు. చంద్రబాబు సీఎంగా ఉండగా, ఆయనతోపాటు లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మిణి, దేవాన్ష్‌లకు సెక్యూరిటీ ఇవ్వలేదా? దేవాన్ష్‌కు నలుగురితో సెక్యూరిటీ ఇవ్వలేదా? అని ప్రశ్నించారు. భద్రత గురించి కాబట్టే.. అప్పుడు ఎవ్వరూ ప్రశ్నించలేదని నాని చెప్పారు. మరి ఇప్పుడు జగన్‌గారి భద్రతపై ఇంత విషప్రచారం ఎందుకు చేస్తున్నారని ఎల్లో మీడియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ గారి తాడేపల్లి నివాసంమీదా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. జూబ్లీహిల్స్‌లో చంద్రబాబు నివాసంలో ఏమున్నాయో ఫొటోలు విడుదల చేయగలరా? అని ప్రశ్నించారు. తాడేపల్లిలో జగన్ నివాసంలో ఏమున్నాయో? మీ నివాసంలో ఏమున్నాయో? నిపుణుడితో ఖరీదు కట్టిద్దామా అని నిలదీశారు. సాక్షి సహా మీడియా వారందరికీ జూబ్లీ హిల్స్‌లో మీ ఇల్లు చూపించగలరా అని ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కుపోయి చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి విజయవాడ రాలేదా? కరకట్ట ఇంటికోసం రోడ్లురూపేణా, హెలిపాడ్ రూపేణా, టవర్ల రూపేణా వందలకోట్లు ఖర్చు చేశారు కదా ఇది నిజం కాదా చెప్పాలన్నారు. పార్టీ ఆఫీసులకు స్ధలాలు ఇవ్వాలని జీవో ఇచ్చింది చంద్రబాబేనని గుర్తుచేశారు. 33 ఏళ్ల లీజు మాత్రమే ఇవ్వాల్సి ఉండగా, 99 ఏళ్లు లీజుకు పెంచుకున్నారన్నారు. టీడీపీ కట్టుకున్న ఆఫీసులు పూరిపాకలు, గుడిసెలు కాదుకదా? అని ఎద్దేవా చేశారు. మీలా ప్రభుత్వ కాంట్రాక్టులు ఇచ్చుకున్న వారితో మేం ఆఫీసులు కట్టించుకోలేదని, పార్టీ డబ్బుతో కట్టుకుంటున్నామని స్పష్టం చేశారు. టీడీపీ ద్వంద్వ ప్రమాణాలను… ఇదే రామోజీరావు కుమారుడు తన పత్రికలో రాయగలరా? అని నిలదీశారు. జగన్‌గారు బెంగళూరు వెళ్తే.. కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని మరొక ఫేక్ ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆరోజు కాంగ్రెస్‌కు ఎదురొడ్డి ధైర్యంగా రాజకీయాలు చేసిన వ్యక్తి జగన్ అని, భయపడ్డం ఆయనకు తెలియదన్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ, మాజీగా ఉన్న సమయంలోనూ ఎంత మంది సెక్యూరిటీ ఉన్నారు? వారి జీతాలు ఎంత? బయటపెట్టాలని సవాల్ విసిరారు. సుమారు 1800 నుంచి 2000 మంది సెక్యూరిటీని నియమించుకోలేదా? అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.
కిరాతకమైన రాతలు
వాస్తవాల్ని వార్తలుగా ప్రచారం చేస్తామని చెప్పుకొని దుకాణాలు తెరిచిన కొన్ని ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు తప్పుడు వార్తలు, దొంగ వార్తలు, తప్పుడు సమాచారంతో ప్రజల మనసుల్లో విషాన్ని ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాయని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల టార్గెట్ రీచ్ అయిన తర్వాత కూడా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి ఈ తప్పుడు వార్తలు రాయడం, చూపించడం ఆపకపోవడం వాళ్ల కిరాతకమైన మానసిక నైజానికి అద్దం పడుతోందన్నారు. రామోజీరావు లేరనుకుంటే వాళ్ల అబ్బాయి ఉన్నట్టున్నారని, ఆయన పేపర్లో తప్పుడు, విషపు వార్త రాశారన్నారు. జగన్ రక్షణకే 986 మంది, ఇంట్లో ఉంటేనే ఇంత మంది బయటకెళ్తే రెండు మూడింతలు.. 5 ఏళ్లలో భద్రతా సిబ్బంది జీతాలకే రూ.296 కోట్లు అని వార్త అచ్చేశారన్నారు. ఇంత దుర్మార్గపు రాతలా? అని ప్రశ్నించారు.
జగన్ గారి సెక్యూరిటీ మొత్తం 196 మంది మాత్రమే
వాస్తవానికి జగన్ మోహన్ రెడ్డి గారికి.. సివిల్ పోలీసులకు సంబంధించి సీఐలు, ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు 18 మంది ఉంటారని పేర్ని నాని వెల్లడించారు. ఆర్మ్ డ్ ఫోర్స్ 33 మంది, ఏపీ స్పెషల్ పోలీస్ బెటాలియన్ నుంచి 89 మంది, జగన్ మోహన్ రెడ్డి గారు సీఎం హోదాలో ఎప్పుడు బయటకు వచ్చినా బ్లాక్ డ్రెస్ లో ఉండే ఆక్టోపస్ కు సంబంధించిన 13 మంది, సీఎం గారి ఇంటి సరిహద్దుల్లో 23 మంది, సీఎం గారి కాన్వాయ్ 21 మంది, మొత్తం 196 మంది సీఎం గారితో ఉండే సిబ్బంది అని, ఆయనకు కేటాయించిన మేరకు ఉన్నారని స్పష్టం చేశారు. వీళ్లు తప్ప ఇంకెక్కడైనా, ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. సీఎంగా ఉండగా జగన్ గారికి బెంగళూరులో సెక్యూరిటీ లేదని, ప్రభుత్వంలో ఉన్నవారు వాకబు చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ లో జగన్ మోహన్ రెడ్డి గారి ఇంటి వద్ద లోటస్ పాండ్ లో ఆక్రమణలు కొట్టేశారని కొన్ని వార్తలు రాశారని, సీఎం గారికి, ఆక్రమణలకు ఏం పని? అని ప్రశ్నించారు. సీఎం సెక్యూరిటీ వింగ్ సీఎం గారి ఇంటి బయట పోలీసులు ఆఫ్ డ్యూటీలో ఉన్న వారు పడుకోవడానికి తాత్కాలికంగా ఫుట్ పాత్ మీద రేకుల షెడ్లు నిర్మించారన్నారు. ఈ తాత్కాలిక నిర్మాణాలు చంద్రబాబు నాయుడు గారి హైదరాబాద్ ఇంటి దగ్గర పాత రోజుల్లో 1996 నుంచి ఉన్నాయి. ఎన్టీ రామారావు, విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య ఇళ్ల వద్ద కూడా కట్టారు. అలాగే జగన్ మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా తాత్కాలికంగా సీఎం సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ వింగ్ వాళ్లు తాత్కాలికంగా బ్యారెక్స్ కట్టారు. పోలీసులు ప్రతి 3 గంటలకోసారి మారుతారు కాబట్టి పడుకోవడానికి కట్టారని గుర్తు చేశారు. ఎవరో రెడ్డి గారికి నచ్చలేదు. కమిషనర్ గారికి చెప్పారు, పడేశారని చెప్పారు. దానితో జగన్ గారికి ఏం సంబంధం? అని నిలదీశారు.
చంద్రబాబు సెక్యూరిటీ జీతాలు ఎంత అయ్యాయి?
చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 దాకా సెక్యూరిటీకి జీతాలు ఎంత అయ్యాయి? మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం దగ్గర, చంద్రబాబు నాయుడు ఇంటి ఎదురుగా ఖాళీ స్థలంలో, ఇంటి వెనుకవైపు, భవానీ ఐల్యాండ్, ఇంటి పక్కన, మదీనాగూడ ఫాం హౌస్, జూబ్లీహిల్స్ మీ రాజ మహల్, చంద్రబాబు చుట్టూ ఎంత మంది పోలీసులు ఉంటున్నారు? ఏపీ పోలీసులు కాకుండా నేషనల్ సెక్యూరిటీ సిబ్బంది ఎంత మంది ఉన్నారు? అన్ని చోట్లా ఎంత మంది ఉన్నారో లెక్క చెప్పండని సవాల్ విసిరారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాములో అరెస్టయ్యి జైల్లో ఉండి, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండి తనకు సెక్యూరిటీ కావాలని బ్లాక్ క్యాట్ కమాండోలను జైలు లోపలికి ఇవ్వాలని అడిగిన చంద్రబాబు గురించి జగన్ మోహన్ రెడ్డి గారికి పోలుస్తూ మీరు వార్తలు రాస్తారా అని దుయ్యబట్టారు. 2014 నుంచి 2019 దాకా ఎక్కడెక్కడ ఎంత మంది పోలీసులను వాడారు? సుమారుగా 1800 నుంచి 2000 మంది పోలీసులను వాడారు కదా? అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ లో మీ ఇంటి దగ్గర, కొన్నాళ్లు ఇళ్లు పడగొట్టి కట్టేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారు, లోకేష్ గారి శ్రీమతి గారు పార్క్ హయత్ హోటల్లో ఉన్నారు కదా. ఆ హయత్ దగ్గర సెక్యూరిటీ ఉందా లేదా? ఆఖరికి సంవత్సరం వయసున్న చంద్రబాబు నాయుడు గారి మనవడికి కూడా 4+4 గన్ మెన్లు ఇచ్చారా?ఇవ్వలేదా? అంటే సంవత్సరం వయసున్న దేవాన్ష్ గారికి నలుగురు గన్ మెన్లు ఉండొచ్చు, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి సెక్యూరిటీకి 196 మంది ఉంటే 986 మంది అని రాస్తారని మండిపడ్డారు. భువనేశ్వరి గారికి, బ్రాహ్మణి గారికి గన్ మెన్లు ఉండేవారని, లోకేష్ గారు మంత్రి అవక ముందు కూడా జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారని గుర్తు చేశారు. ఉండటం తప్పు అని గానీ, ఉండటం తప్పు అనిగానీ తాను అనటం లేదన్నారు. చంద్రబాబు నాయుడు గారివి, లోకేష్ గారివి, లోకేష్ గారి భార్యవి, అబ్బాయివి, చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారివే ప్రాణాలు.. జగన్ మోహన్ రెడ్డి గారివి ప్రాణాలు కాదా? అని నిలదీశారు.
చంద్రబాబు ఇంటి రోడ్డును బ్లాక్ చేయలేదా?
సెక్యూరిటీ ఆడిట్ జరగకుండానే మొన్నీమధ్య.. తాడేపల్లిలోని రోడ్డును ఉద్దేశించి ఇన్నాళ్లూ ఇది ప్రజల రహదారి.. దీన్ని మూసేశారంటూ రాశారన్నారు. 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు ఉన్న ఇళ్లు లింగమనేని రమేష్ దా, స్టేట్ గవర్నమెంట్ దా, అద్దెకు తీసుకున్నారా, కొనుక్కున్నారా తెలియదన్నారు. ఉండవల్లిలో లోటస్ హోటల్ నుంచి మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం మీదుగా కరకట్ట రోడ్డు మొత్తం ట్రాఫిక్ జడ్జిలను తప్ప ఎవరినైనా వెళ్లనిచ్చేవారా? ఆఖరికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అటు దారి లేదు కదా? అని ప్రశ్నించారు. మందడం, వైకుంఠపురం, కృష్ణాయపాలెం ఊర్లకు లోపలి నుంచి చుట్టూ తిరిగి రావాల్సిందే కదా అని గుర్తు చేశారు. మొత్తం 13 కిలోమీటర్లు రోడ్డు మూశారా? లేదా? అని ప్రశ్నించారు. సీఎం నివాసం ఉంటున్నప్పుడు సెక్యూరిటీ రివ్యూలో ఏ రోడ్డు బ్లాక్ చేయాలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
మీ పార్టీ ఆఫీసులు పూరిపాకలా?
తాడేపల్లి క్యాంప్ ఆఫీసు ప్యాలెస్ అని లోకేష్ మాట్లాడతాడని, ఎర్రబుక్కు రాసింది నిజమైతే, ఖలేజా ఉన్న రాజకీయ నాయకుడైతే.. హైదరాబాద్ లో మీ జూబ్లీహిల్స్ ఇంటి ఫొటోలు ఎవరికైనా చూపించారా? అని లోకేష్ ను పేర్ని నాని ప్రశ్నించారు. ఒకసారి సాక్షి ఛానల్ సహా మీడియా టూర్ పెట్టాలని, అలాగే జగన్ మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా మీడియా టూర్ పెడదామని సవాల్ విసిరారు. లేదా రిటైర్డ్ జడ్జితో వ్యాల్యుయేషన్ చేయిద్దామన్నారు. ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఇవాళ జగన్ మోహన్ రెడ్డి గారి వరకు చంద్రబాబు అవసరాలు తీరడం కోసం, రాజ్య కాంక్ష తీర్చడం కోసం ఎంతటి వ్యక్తినైనా వ్యక్తిత్వ హననం చేయనిదే వీళ్లు వదిలిపెట్టరన్నారు. 21.07.2016న జీవో నంబర్ 340ని చంద్రబాబు గారు తెచ్చారని, పార్టీ ఆఫీసులకు స్థలాలిచ్చిన ఆనవాయితీని తెచ్చామన్నారని గుర్తు చేశారు. అందులో కేటగిరీల వారీగా జాతీయ పార్టీలు, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, ఎవరికైతే 50 శాతం తగ్గకుండా శాసనసభలో సభ్యులున్నారో వాళ్ల కేంద్ర కార్యాలయం కట్టుకోవడానికి 4 ఎకరాలు కేటాయించవచ్చన్నారని తెలిపారు. ఆ సంఖ్య 25 శాతం పైన ఉంటే ఆ పొలిటికల్ పార్టీకి అర ఎకరం, 25 శాతం లోపు ఉండి ఒక్క సభ్యుడైనా ఉంటే 1000 గజాలు, అలాగే జిల్లా కేంద్రాల్లోనూ స్థలాలు ఇవ్వొచ్చని పేర్కొన్నట్లు తెలిపారు. ఈ జీవోను ఆధారం చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం 2016 నుంచి 2019లోపు 10 జిల్లాల్లో ఆఫీసులు కేటాయించుకున్నారని పేర్ని నాని గుర్తు చేశారు. వైయస్సార్ కడప, శ్రీకాకుళం, మంగళగిరి, విజయనగరం, చిలకలూరిపేట, గుంటూరు, విజయవాడ, ప్రకాశం, చిత్తూరు కాకినాడ, నెల్లూరు, ఏలూరు, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో స్థలాలు తీసుకున్నారని, 33 ఏళ్లకు మించి ఇవ్వకూడదని జీవో వాళ్లే ఇచ్చి, 99 ఏళ్లకు ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ లో చంద్రబాబు కట్టించిన ఎన్టీఆర్ ట్రస్టు భవన్ ఏమైనా పూరి పాకా, రేకుల షెడ్డా, ఒకే గది ఉన్న శ్లాబా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి పార్టీ ఆఫీసుకు తీసుకుని ఆ తర్వాత ఎన్టీఆర్ ట్రస్టుకు రాశారని గుర్తు చేశారు. మంగళగిరిలో మీ పార్టీ ఆఫీసు రేకుల షెడ్డా? పూరి పాకా? మీ రక్తాన్ని చమటోడ్చి పైసా పైసా కూడబెట్టి కట్టిన పూరి పాకా? అని ప్రశ్నించారు. టీడీపీ ఆఫీసుల కార్యాలయాలను ఈ సందర్భంగా పేర్ని నాని మీడియాకు చూపించారు.
ఫర్నిచర్ పైనా నీచరాజకీయమా?
సీఎం క్యాంప్ ఆఫీసులో ఫర్నీచర్ గురించి మాట్లాడతారని, మీ ఆఫీసులో ఫర్నీచర్ ఎవరు వేశారు లెక్కలు తీయండని పేర్ని నాని డిమాండ్ చేశారు. ఉండవల్లిలో మీ ఇంటికి రైతుల పొలాల్లోంచి రోడ్లు వేసేస్తారు, వీధిలైట్లు, ఫర్నిచర్.. ఏది కావాలాంటే అది ఎన్ని కోట్లు కావాలన్నా ఖర్చు పెడతారని, ఏ ముఖ్యమంత్రికైనా అది జరుగుతుందన్నారు. ఆఖరికి జనం సొమ్ముతో చంద్రబాబు నదిలోకి దిగి కాళ్లు కడుక్కోవడానికి మెట్లు కూడా కడతారని, ఇది మాత్రం ఎవడూ రాయడన్నారు. రైతుల డబ్బుతో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు కదా అని ప్రశ్నించారు. ఆనవాయితీ ప్రకారం మంత్రులుగానీ, ముఖ్యమంత్రులుగానీ ఇంట్లో ఫర్నిచర్ ఉంటే డబ్బులు కడతాం అని లెటర్ పెడితే అయితే ఇంత డబ్బు కట్టాలని లెటర్ ఇస్తారు, లేదంటే ఫర్నిచర్ పట్టుకెళ్లిపోతారన్నారు. మీరు డబ్బు కట్టమంటే డబ్బు కట్టడానికి, లేదా సామాన్లు ప్రభుత్వానికి ఇచ్చేయమంటే ఇచ్చేస్తామన్నారు. కోడెల శివప్రసాద రావు గారి హైదరాబాద్ నుంచి అమరావతికి సామాన్లు తరలించే క్రమంలో బైకుల షోరూముల్లో, ఆస్పత్రిలో ఉన్నాయి కాబట్టి నేరమైందని, అంతేగానీ గవర్నమెంట్ బంగ్లాలో, స్పీకర్ బంగ్లాలో ఉంటే అది నేరం అవ్వదని సూచించారు. ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి ఎన్ని చేసినా మా గొంతు విప్పి నిజాలను ప్రపంచానికి చెబుతూనే ఉంటామన్నారు.
తాడేపల్లి నుంచే పోరాటం కొనసాగుతుంది
తాడేపల్లిలో జగన్ మోహన్ రెడ్డి గారి ఇంటి చుట్టుపక్కల అపార్ట్ మెంట్లు ఉన్నాయి కాబట్టి ఐరన్ గ్రిల్ ఏర్పాటు చేశారని పేర్ని నాని వివరించారు. సీఎం ప్రాణాలు కాపాడటానికి గవర్నమెంట్ డబ్బులతో కాకుండా సొంత డబ్బులతో సొంత డబ్బులతో చేస్తారా? అని ప్రశ్నించారు. ఆరేళ్ల తర్వాత బెంగళూరుకు జగన్ మోహన్ రెడ్డి గారు వెళ్లారని అయితే, కాంగ్రెస్ పార్టీలో విలీనం కోసం వెళ్లాడని ఫేక్ న్యూస్ రాశారని మండిపడ్డారు. చంద్రబాబు, సోనియా గాంధీ చీకట్లో కలుసుకుని 16 నెలలు జైల్లో పెడితే ఏమైనా తగ్గాడా? ఓడిపోతే తగ్గుతాడా? అని గుర్తు చేశారు. జగన్ మోహన్ రెడ్డి గారు మళ్లీ ఎన్నికల్లో గెలిచే వరకు తాడేపల్లిలోనే ఉండి రాజకీయాలు చేస్తారని స్పష్టం చేశారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండని సవాల్ విసిరారు. భారతదేశంలో జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతంలో 5వ పెద్ద పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. జగన్ తగ్గుతాడా? తప్పుడు కేసులు పెట్టి జైల్లో మగ్గదీస్తేనే భయపడనివాడు ఇప్పుడెలా భయపడతాడు? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో 65 శాతం మంది చూసే టీవీ9, ఎన్టీవీ, సాక్షి టీవీలను కేబుల్ చానళ్లలో నిషేధించారని మండిపడ్డారు. మొత్తం 15 మంది ఎంఎస్ఓలపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశామన్నారు. ఏ నంబర్లలో అంతకు ముందు వచ్చాయో అదే స్థానంలో ప్రసారం చేయాలని జడ్జిమెంట్ వచ్చిందన్నారు. ప్రసారం చేయకపోతే న్యాయపోరాటం చేస్తామన్నారు. ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ఓనర్లు ఇకనైనా ధర్మంగా ప్రవర్తించాలని సూచించారు. ఎమ్మెల్యేగా గెలిచి ఓ మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఓడిపోయాడు గానీ చావలేదు, చంపేయాలి అనే సంస్కారం ఉన్న వ్యక్తినీ స్పీకర్ చైర్ లో కూర్చోబెడితే రేపు సభ ఎలా నడుపుతాడని, అందుకే తాము బాయ్ కాట్ చేశామని ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్ని నాని చెప్పారు.