వివాహేతర సంబంధం ఆరోపణలపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. దువ్వాడ వ్యవహారం పార్టీకి ఎక్కడ మచ్చ తెస్తుందోనని భయపడ్డ అధిష్టానం అతనిపై వేటు వేసింది. ఎమ్మెల్సీ హోదాలో ఉన్న దువ్వాడ శ్రీనివాస్…టెక్కలి వైఎస్ఆర్సీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు. ఇప్పుడీ టెక్కలి నియోజకవర్గ ఇంఛార్జ్ పదవి నుంచి ఆయన్ను తప్పించారు. దువ్వాడ స్థానంలో పేరాడ తిలక్‌ను నియమించి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. కాగా, ఇప్పటికే స్వచ్ఛందంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయమని పార్టీ హైకమాండ్ ఒత్తిడి కూడా తెచ్చిందని టాక్ అయితే నడుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజమన్నది తేలాల్సి ఉంది.
శీనుగారి ‘సీను’ మారిందిలా..?
కొద్దిరోజులుగా దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం వ్యవహారాలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. టెక్కలిలోని దువ్వాడ శ్రీను ఇంటికి వచ్చిన ఆయన సతీమణి వాణి.. అక్కడే 15 రోజులుగా ఆందోళన చేస్తోంది. దివ్వెల మాధురి ట్రాప్‌లో పడిన దువ్వాడ శ్రీను తనను, తన కుమార్తెలను వదిలేశారని ఆరోపిస్తోంది. తాను దువ్వాడ శ్రీనుతోనే కలిసి ఉంటానని.. ఆయనతో ఆ ఇంట్లో ఉండేందుకు అనుమతించాలని కోరుతోంది. కానీ వాణి మాటలను దువ్వాడ శ్రీను ఖండించగా వాణితో లీగల్‌గానే తేల్చుకుంటానని ఖరాఖండీగా చెబుతున్నారు. తండ్రిగా తన కూతుళ్లకు ఇప్పటికే చాలా చేశానని.. వాళ్ల పేరు మీద మరో 29 కోట్ల ఆస్తులు రాయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కానీ టెక్కలిలోని ఇంటిని మాత్రం ఇవ్వనని తేల్చిచెప్తున్నారు. ఇలా దువ్వాడ వ్యవహారం పెద్ద దుమారం రేగడంతో ఆయన్ను టెక్కలి ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తప్పిస్తూ వైసీపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.