పనుల పునఃప్రారంభంతో అమరావతికి ఊపిరి..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన నాటినుంచి ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా అమరావతిని కేటాయించి, 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్.. పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో ఈ అంశంపై న్యాయస్థానాల్లో విచారణ జరిగిందికానీ, ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదు. ఫలితంగా అమరావతి రాజధాని అంటూ బాబు నాడు చేసిన పనులన్నీ ఆగిపోవడమే కాదు, తాను తీసుకున్న మూడు రాజధానుల గోతిలో జగన్ మోహన్‌రెడ్డి పడ్డారు కాబట్టే ప్రజలు గట్టి బుద్ధి చెప్పారని విశ్లేషకులు అంటుంటారు.
అయితే మొన్నటి ఎన్నికల్లో ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి రాగా మళ్లీ రాజధాని అమరావతిపై ఆశలు చిగురించాయి. ఈ మేరకు అమరావతిపై గట్టి నిబద్ధతతో ఉన్న సీఎం చంద్రబాబు…పదవిలోకి వచ్చిన నాలుగునెలలకే ఆ ప్రాంతంలో పనులను షురూ చేయిస్తున్నారు. ఈ క్రమంలో అక్టోబర్ 19నుంచి అమరావతిలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. మొదటిగా సీఆర్‌డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ భవనంతో పనులకు ఉపక్రమించింది ప్రభుత్వం. వాస్తవానికి ఈ భవన పనులను 2017లో ప్రారంభించారు. జగన్ అధికారంలోకి రావడంతో నాడు పనులన్నీ ఆగిపోయాయి. మొత్తం 3.62 ఎకరాల్లో జీ ప్లస్ 7 భవనాన్ని 2లక్షల 42వేల 481 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రస్తుతం చంద్రబాబు సర్కార్ పనులను పునఃప్రారంభించి.. ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని అమరావతే అని గట్టి సందేశం ఇచ్చింది.