మట్కా – మూవీ రివ్యూ
ఎవరు ఎలా చేసారు :
జూదంతో జీవితం మారిపోద్ది, అదే సమయంలో తగలడిపోద్ది అన్న తీరుతో ‘మట్కా’ అంటూ మనముందుకు వచ్చారు మెగా వారి హీరో వరుణ్‌తేజ్. జయాపజయాలతో సంబంధం లేకుండా భిన్నమైన కథలను ఎంచుకుని సినీప్రపంచంలో ప్రయాణం సాగిస్తున్న వరుణ్‌తేజ్…పలాస చిత్రాన్ని డైరెక్ట్ చేసిన కరుణకుమార్‌తో కలిసి పనిచేశారు. మట్కా చిత్రంలో స్టోరీకి తగ్గట్టుగా భిన్నమైన గెటప్పులతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఒక ఎత్తయితే…రిలీజ్‌కు ముందే టీజర్, ట్రైలర్లు చిత్రంపై మాంచి క్రేజ్ తీసుకొచ్చాయి. హీరోగా వాసు క్యారెక్టర్‌లో వరుణ్ తేజ్, హీరోయిన్ సుజాత క్యారెక్టర్‌లో మీనాక్షిచౌదరి నటించగా…సలోని, నోరా ఫతేహి, అజయ్ ఘోష్, జాన్ విజయ్, సత్యం రాజేశ్, కిశోర్, నవీన్ చంద్ర, తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. మట్కా చిత్రానికి సంగీతం ప్రకాశ్ కుమార్ కాగా, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా కిశోర్ కుమార్…స్టోరీ మరియు డైరెక్షన్ కరుణకుమార్ చేశారు. రజనీ తాళ్లూరి, తీగల విజయేందర్‌రెడ్డి ‘మట్కా’ చిత్రాన్ని నిర్మించారు.
కథ :
1970కి ముందు జరగిన కథతో మట్కా చిత్రాన్ని తీసుకొచ్చారు మేకర్స్. బర్మా నుంచి త్లలితోపాటు వైజాగ్‌కు శరనార్థిగా చిన్నతనంలోనే వచ్చిన వాసు…అనుకోని పరిస్థితుల్లో ఒకరిని హత్యచేసి జువైనల్ హోంకి నెట్టబడతాడు. అదే సమయంలో సత్యం రాజేశ్…వాసు తల్లికి పెద్దకొడుకుగా అండగా నిలుస్తాడు. ఖైదు కాబడ్డ వాసును…జైలు వార్డెన్ నారాయణమూర్తి (రవిశంకర్) తన స్వార్థంకోసం ఒక వెపన్‌లా వాడి డబ్బు సాంపదిస్తాడు. వాసు రింగ్‌లో నిలబడి కొట్టాడంటే అవతలి ఎంతవ్యక్తి ఉన్నా నేలకొరగాల్సిందే. చివరికి వాసు జైలుజీవితం చిన్నప్పటితో మొదలై, వయస్సు వచ్చాక పూర్తవుతుంది. అలా జైలు నుంచి బయటకి వచ్చిన వాసు… విశాఖపట్నం అని పేరు ఎవరు తలచినా, అయితే సముద్రం లేదా తన పేరు గుర్తుకు రావాలన్న ధీమాతో జనారణ్యంలోకి అడుగుపెడతాడు. ఈ క్రమంలోనే పూర్ణా మార్కెట్‌లో ఉన్న కొబ్బరి కొట్టు వ్యాపారి అప్పలరెడ్డి (అజయ్ ఘోష్)కి ఓ సందర్భంలో విలన్ల నుంచి కాపాడి ప్రాణభిక్ష పెడతాడు. అయితే నెల్లూరు నుంచి వచ్చిన కె.బి.రెడ్డి (జాన్ విజయ్), నానిబాబు (కిశోర్)లు అప్పటికే వైజాగ్‌లో ఎవరివర్గం వారు సెటిల్‌మెంట్‌లు, దందాలు చేసుకోవడం…ఇరువర్గాలకి ఒకరికి ఒకరు పడకపోవడం జరుగుతూ వస్తుంటుంది. ఎప్పుడైతే కె.బి.రెడ్డి మనిషిని కొట్టి వ్యాపారి అప్పలరెడ్డిని మనహీరో కాపాడుతాడో పరోక్షంగా అతన్ని.. నానిబాబు చేరదీసి సొసైటీలో పెద్దమనిషిలా చలామణి అయ్యేలా అనేక అవకాశాలు కల్పిస్తాడు. అలా అలా… కూలీ స్థాయి నుంచి కోట్లకు పడగలెత్తేలా వాసు జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి?, వేశ్య కుటుంబం నుంచి వచ్చిన సుజాతను ఎంతో ఇష్టపడి వాసు పెళ్లి చేసుకోవడానికి కారణాలు ఏంటి? ఓ రోజు నానిబాబు ఇంట్లో వాసు ఉండగా కాల్పులు జరిపింది ఎవరు?, ఆ కాల్పుల్లో హీరో ఎవరెవరిని కోల్పోతాడు? ఎందుకు ఇష్టపడ్డ సోఫియా (నోరా ఫతేహి)ని వాసు చంపేస్తాడు?, తన మెంటర్‌గా భావించే నానిబాబుని వాసు చంపేయడం వెనుక కారణమేంటి?, కోట్లానుకోట్లకు పడగలెత్తాలంటే మట్కా జూదాన్నే వాసు ఎందుకు ఎంచుకున్నాడు?, మట్కా ఎందరి జీవితాలను నాశనం చేసింది?, చివరికి దేశవ్యాప్తంగా ఉన్న డబ్బంతా కోట్లానుకోట్లు ఒక్క వైజాగ్‌లోనే ఉండటంతో నాటి ప్రధాని ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? వాసు మట్కా ఆటతో దేశం ఆర్థికంగా కష్టాల్లో పడిందా? ఢిల్లీ నుంచి సీబీఐ ఆఫీసర్‌గా వచ్చిన సాహు (నవీన్ చంద్ర) సాధించింది ఏంటి?…తెలుసుకోవాలంటే ‘మట్కా’ చిత్రాన్ని తప్పక చూడాల్సిందే.
చిత్ర బలాబలాలు…
1) అవుట్‌స్టాండింగ్ నటనతో వరుణ్ తేజ్ కట్టిపడేశాడు, స్టోరీకి తగ్గట్టు భిన్నమైన గెటప్పుల్లో కనిపించడంతో మట్కా చిత్రం ద్వారా నటుడిగా మరిన్ని మార్కులు కొట్టేశాడు.
2) హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి చెప్పక్కర్లేదు. తన పదునైన కళ్లతో మాయం చేసే ఈ నటి…హోమ్లీగా కనిపించి కుటుంబసమేత ప్రేక్షుకలకు దగ్గరయింది.
3) 1970 నాటి కథ కావడంతో అందరి క్యారెక్టర్స్ వింటేజ్ లుక్స్‌తో ఆకట్టుకున్నాయి. ఎక్కడా లేటెస్ట్ విజువల్ కనపడకుండా మేకర్స్ జాగ్రత్తపడ్డారు.
4) హీరో క్యారెక్టర్‌లో ఎక్కువగా నెగిటివ్ షేడ్ ఉన్నా…ఆరడుగులకు పైగా కటౌట్‌తో వాసు క్యారెక్టర్‌ని డిజైన్ చేసి, ప్రత్యర్థులకు చుక్కలు చూపించడంలో డైరెక్టర్ కరుణకుమార్ సక్సెస్ అయ్యారు.
5) బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది.
6) విలన్లుగా కిశోర్, జాన్ విజయ్‌లు చేసిన నటన అద్భుతం.
చిత్ర బలహీనతలు….
1) స్టోరీ ఇంతకుముందే తెలుసు అనేలా ఉండటం, స్క్రీన్‌ప్లేలో కొత్తదనం లేకపోవడం.
2) మీనాక్షి చౌదరి అంటే మినిమమ్ లవ్‌సీన్లు ఎక్స్‌పెక్ట్ చేసే ఆడియన్స్‌ని నిరూత్సాహ పరచడం.హీరోహీరోయిన్ల మధ్య గుర్తుండిపోయేంత లవ్‌సాంగ్ ఒక్కటైనా మచ్చుకు లేకపోవడం.
3) తన సహచరి సోఫియాను చంపేశాడని తెలిసినా హీరో వాసుని…నానిబాబు ఏమీ చేయకపోవడం.
(గమనిక – మట్కా చిత్ర సమీక్ష ప్రేక్షకుడి అభిప్రాయ పరిధిలోనిది మాత్రమే)
రేటింగ్ : 3/5