చిన్న సినిమా, చిన్న హీరో అని తీసి పారేసే సినిమా కాదు ‘శివం భజే’. మూలం మహేశ్వరరెడ్డి నిర్మాణ సారథ్యంలో గంగా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆద్యంతం కట్టిపడేసింది. దేశంలో పెనుముప్పు సృష్టించి ఈ క్రమంలో ఇండియన్ ఆర్మీని దృష్టి మరల్చడం అనేది చైనా కుట్ర. మన దాయాది దేశమైన పాకిస్తాన్‌తో చేయి కలిపి అరుణాచల్ ప్రదేశ్ వద్ద నవాంగ్ ప్రాంతాన్ని కైవసం చేసుకోవాలన్న చినీ దేశ కుట్రను హీరో విఫలయత్నం చేయడమే ఈ చిత్ర సారాంశం. ఓవైపు దేశ భద్రత, ఈక్రమంలో మిస్టీరియస్ మర్డర్స్ సినిమాను చివరివరకు సస్పెన్స్ కొనసాగేలా చేశాయి. ఇంతకీ ఎవరు విలన్ అనేది చివరి వరకు తెలియకుండా స్క్రీన్‌ప్లేని చక్కగా తీర్చిదిద్దాడు డైరెక్టర్ అప్సర్.
హీరో శేఖర్ తండ్రి కానిస్టేబుల్ ఉద్యోగే అయినా అత్యంత శివభక్తుడు. అయితే ఓ రోజు శివాలయంలో చోరీ చేస్తూ పారిపోతున్న దొంగలను పట్టుకునే ప్రయత్నంలో రోడ్డు యాక్సిడెంట్‌లో చనిపోతాడు. అయితే శివుడే తన నాన్నను దూరం చేశాడని చిన్నప్పటి నుంచి ఈశ్వరుడంటే హీరోకు కోపం. అంతేనా శునకాలన్నా కూడా అంతే భయం. ఉద్యోగ రీత్యా ఓ బ్యాంకులో రికవరీ ఏజెంట్‌గా పనిచేసే హీరో శేఖర్ (అశ్విన్ బాబు)కు రౌడీమూకల దాడిలో కళ్లుపోతాయి. అయితే హుటాహుటిన ఆస్ప్తత్రికి తరలించడం, ఎవరో డోనర్ ఇచ్చిన కళ్లు అమర్చడం చకాచకా జరిగిపోతాయి. ఇక్కడే సినిమాకు టర్నింగ్ పాయింట్ అనిచెప్పుకోవాలి. కళ్లు అమర్చిన దగ్గరనుంచి హీరో పడే బాధ అంతా ఇంతా కాదు. దారి మధ్యలో కలిసేవాళ్లని చూసినా, ఎవరైనా అనుమానిత వ్యక్తులు తారాసపడినా హీరో మైండ్ డిస్ట్రర్బ్ అయిపోవడం జరుగుతుంటుంది.
చదవండి: ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామాగా వస్తున్న ‘అలనాటి రామచంద్రుడు’
ఎందుకిలా జరుగుతుందా అని అతనికి వైద్యం చేసిన బ్రహ్మాజీని అడిగితే ఇదంతా కామన్ అంటూ కొట్టిపాడేస్తాడు. అయితే రోజురోజుకీ హీరో పడే బాధ వర్ణణాతీతం. చివరికి, అదే ఆస్పత్రికి విదేశాల నుంచి వచ్చిన సీనియర్ డాక్టర్ మురళీశర్మ అతని పరిస్థితి తెలుసుకుని పరీక్షలు చేస్తాడు. ఇక్కడే నివ్వెరపోయే నిజం బట్టబయటలు అవుతుంది. హీరోకు అమర్చిన నేత్రాలు మనిషివికావు, ఓశునకానికి సంబంధించినవి అని చెప్పేసరికి హీరో షాక్ తింటాడు. నేత్రాలను ఆస్పత్రికి చేర్చిన డెలివరీ బాయ్ తప్పిదం వల్లే ఈ పొరపాటు జరిగిందని హాస్పటల్ మేనేజ్‌మెంట్ హీరోను క్షమాపణ కోరుతుంది. అయితే వైద్యులు చేసిన ఈ నిర్వాకంతో హీరో ఆగ్రహంతో ఊగిపోతాడు. అయితే చనిపోయిన శునకం.. తన కళ్ల ద్వారా ఏదో చెప్పాలనుకుంటుందని అదేంటో తేల్చేపనిలో పడతాడు మన హీరో. విషయంలోకి వెళ్తే దేశ జనాభాకి వ్యాక్సినేషన్ డోసులు పంపించే బైనరీ కెమికల్స్ ఛైర్మన్ రజిత్ అరోరా …చైనా-పాకిస్తాన్ చేపట్టే ఆపరేషన్ లామా కుట్రకు అమ్ముడుపోతాడు.
బైనరీ కెమికల్స్ పంపిణీ చేసే వ్యాక్సిన్‌లో సైనేడ్ కలపి ఇచ్చేయాలన్నది చైనా వ్యూహం. దీనికి పాకిస్థాన్ కూడా తన వంతు మద్దతు ఇస్తుంది. సైనేడ్ కలిపిన ఆ వ్యాక్సినేషన్ తీసుకుంటే జనం రోజుల వ్యవధిలో మరణించడం, ఈ క్రమంలో బోర్డర్‌లో కాపలకాసే ఆర్మీ… దేశంలో మరణాలపై దృష్టి పెట్టే సమయంలో అరుణాచల్ ప్రదేశ్ వద్ద నవాంగ్ ప్రాంతాన్ని హస్తహతం చేసుకుందామని అటు చైనా…అలాగే కశ్మీర్ బోర్డర్ వద్ద మరింత పాగా వేసేందుకు ఇటు పాకిస్తాన్ ప్లాన్ చేసుకుంటాయి. అయితే బైనరీ కెమికల్స్‌లో పరిశోధనలు జరుపుతున్న నలుగురు సైంటిస్టులకి ఈ కుట్ర విషయం తెలిసిపోతుంది. అయితే వారందరినీ పక్కా స్కెచ్‌తో ఎవరు హత్య చేశారో తెలియకుండా చంపేస్తారు. ఈ హత్యలు ఎవరు చేశారన్నదానిపై ఓవైపు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుండగా విధుల్లో పాల్గొన్న పోలీస్ డాగ్ ‘డోగ్రా’ చనిపోవడం…ఆ డోగ్రా కళ్లే హీరోకు అమర్చడంతో కథ ముందుకు సాగుతుంది. ఈ మిస్టిరీయస్ డెత్‌లను చేధించేందుకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ రంగంలోకి దిగడం ఒక ఎత్తయితే…అతడే పోలీస్ డాగ్ డోగ్రాను చంపేశాడని తెలియడం, ఇతడే మెయిన్ విలన్ అన్న సస్పెన్స్‌ను ఎండ్ కార్డ్ పడేవరకు కొనసాగించడంతో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. ఓ రకంగా చెప్పాలంటే శివుడంటే ఇష్టపడని హీరోకు.. ఓ పోలీస్ డాగ్ కళ్లు అమర్చి కాలభైరవుడి అవతారంగా అతన్ని చూపించి విలన్లని మట్టుబెట్టేలా స్క్ర్రీన్‌ప్లే రాసుకోవడం అప్సర్‌కే చెల్లింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే డైరెక్టర్ అప్సర్ ముస్లిం మతానికి చెందిన వ్యక్తి అయినా… శివుడు, కాలభైరవుడిని ఉద్దేశించి సినిమాచేయడం సర్వమతాలు సమానమే అన్న సందేశం ఇచ్చినట్లయింది.
చిత్ర బలాబలాలు – హీరోగా అశ్విన్‌బాబు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అర్భాజ్ ఖాన్ నటన అద్భుతం…వైద్యుడిగా బ్రహ్మాజీ, సీనియర్ వైద్యునిగా మురళీశర్మ, నిత్యం శివారాధనలో తులసి, హీరో ఫ్రెండ్‌గా హైపర్ ఆది తమ నటనతో మెప్పించారు. మరీ ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ ఇచ్చిన ఆర్ ఆర్ ఈ సినిమాకు హైలెట్. అలాగే రం రం ఈశ్వరం అంటూ శివస్తుతితో వచ్చిన సాంగ్ మరో హైలెట్. స్క్రీన్ ప్లే చక్కగా ఉంది. స్టంట్స్ అదిరిపోయాయి. డీవోపీ చాలా రిచ్‌గా ఉంది. హీరోగా అశ్విన్ బాబు తన నటనతో మరో మెట్టు ఎక్కారనే చెప్పాలి.
చిత్ర బలహీనతలు – హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ పెద్దగా పండకపోవడం, వాళ్లిద్దరి మధ్య సరైన లవ్ ట్రాక్ & రొమాన్స్ లేకపోవడం…దేశానికి ముప్పు అంటూ ఇటు చైనా-అటు పాక్ కుట్రను ఎంతో గొప్పగా తెరకెక్కించి చివరికి ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మరణంతో కథను ముగించేయడం సింపుల్‌గా అనిపించింది.
మొత్తానికి నటన పరంగా, స్టోరీ ఎంపిక పరంగా హీరో అశ్విన్ బాబుకు మంచి మార్కులే పడ్డాయని చెప్పొచ్చు.
(గమనిక – ఈ చిత్ర రివ్యూ ప్రేక్షకుల అభిప్రాయాలను తీసుకున్నది మాత్రమే)
రేటింగ్ : 2.5/5