కంగువా – మూవీ రివ్యూ
పీరియాడిక్, ఫాంటసీ కలగలిపిన చిత్రం సూర్య నటించిన ‘కంగువా’. పాన్ ఇండియా మూవీగా అనేక భాషల్లో ప్రేక్షకులని పలకరించిన ‘కంగువా’….నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. హీరో సూర్యతోపాటు దిశాపటానీ హీరోయిన్‌గా నటించగా, బాబీ డియోల్ విలన్ రోల్ ప్లే చేశాడు. అలాగే యోగిబాబు, నటరాజన్, రెడిన్ కింగ్‌స్లే లాంటి ప్రముఖ నటులు సైతం స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
శివ, ఆదినారాయణల ద్వయం కథారచయతలు కాగా… మెగాఫోన్‌కూడా శివ పట్టాడు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్, వంశీ, ప్రమోద్ నిర్మాణం చేపట్టారు. డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా పళనిస్వామి, మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవిశ్రీ ప్రసాద్ కంగువాకు పనిచేశారు.
కోలీవుడ్‌లో స్టార్ డమ్ ఉన్న అగ్ర కధానాయకుల్లో సూర్య కూడా ఒకరు. పీరియాడిక్, ఫాంటసీ, యాక్షన్ కలగలిపిన ‘కంగువా’ చిత్రంతో ప్రేక్షకులను కలిసేందుకు వచ్చాడు సూర్య. టాలీవుడ్‌కు బాహుబలి ఎలానో, కోలీవుడ్‌కు ‘కంగువ’ అలాంటిదని మొదట్నుంచి మాంచి హైప్ రావడంతో అందరి దృష్టి ఈ చిత్రంపై పడింది. మూవీకంటే ముందు రిలీజైన టీజర్, ట్రైలర్‌లలో యాక్షన్ ఎపిసోడ్స్‌ను జోడించడంతో చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మరి చిల్డ్రన్స్ డే, నవంబర్ 14న రిలీజైన ‘కంగువా’ ప్రేక్షకుల ఆదరణకు నోచుకుందా, లేదా అనేది ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కథ :
గోవాలో ఉండే ఫ్రాన్సిస్ (సూర్య) పోలీసులు కూడా చేయలేని సాహోసోపేతమైన ఛాలెంజ్‌లకు దిగుతుంటాడు. పరారీలో ఉంటున్న వారిని పట్టుకుని అప్పజెప్పి, ప్రతిగా పోలీసుల నుంచి డబ్బు తీసుకుంటూ లైఫ్‌ని ఎంజాయ్ చేసే క్యారెక్టర్ ఫ్రాన్సిస్‌ది. అలాగే ఏంజెలా (దిశాపటానీ) కూడా. వీరిద్దరూ ప్రేమికులైనా ఎప్పుడూ గొడవపడుతూ ఉంటారు. వీళ్లద్దరి టార్గెట్ ఒక్కటే… బౌంటీ హంటర్స్, వీరిద్దరికి స్నేహితుడిగా ఉండి వాళ్లయొక్క సాహసాల్లో పాలుపంచుకుంటూ ఉంటాడు యోగిబాబు. అయితే కథ ఇలా సాగుతుండగా..సడన్‌గా ఓమాఫియా డెన్‌నుంచి బాలుడు జీటా తప్పించుకుని గోవాకు పారిపోయి అక్కడ ఫ్రాన్సిస్‌ను కలుస్తాడు. అయితే ఇక్కడే ట్విస్ట్ చోటుచేసుకుంటుంది. జీటాను చూడగానే పాతజ్ఞాపకాలు అన్నీ ఒక్కొక్కటిగా మనహీరోకి గుర్తొస్తుంటాయి. జీటాతో గతజన్మ బంధం ఏదో ఉందని అనుకుంటున్న లోపే, ఓసారి విలన్ గ్యాంగ్ వచ్చి జీటాను ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలో జీటాను ఎలాగైనా కాపాడుకోవాలి అని, విలన్ ముఠాతో సమరానికి సై అంటాడు. ఓవైపు పోరాటం చేస్తున్న ఫ్రాన్సిస్‌కి…మరోవైపు, వేల ఏళ్ల క్రితం జీటాతో తనుకున్న బాండింగ్ గుర్తొస్తుంది. 1,070 సవంత్సరాల నాటి ప్రణవకోన యువరాజు కంగువా… 2024లో ఫ్రాన్సిస్‌గా కనపడటం…గత జన్మలో కుర్రాడు నేడు మనహీరోకి జీటాగా తారాసపడటం…ఈ ఎపిసోడ్‌తోనే చిత్రకథ ముందుకు సాగుతుంది.
కథ విశ్లేషణ :
అసలు, ప్రణవకోన యువరాజు కంగువాతో పులవా అనే కుర్రాడికి ఉన్న సంబంధం ఏంటి..? పులవ కుటుంబం కోసం కంగువా ఎందుకు కట్టుబడిఉంటాడు?, ఎందుకు మరుజన్మలోనూ ఆ కుర్రాడిని కాపాడే ప్రయత్నం చేస్తాడు?, ఈ జన్మలో కుర్రాడు జీటాను వెంటాడేదెవరు?, సముద్రానికి ఆనుకుని కొండల మధ్యలో ఉన్న ఆ ఐదు కోనల ప్రత్యేకతలేంటి?, ఇందులో కపాల కోన యువరాజు రుధిర (బాబీ డియోల్) పాత్ర ఏంటి?, ఐదుకోనల ప్రజల మధ్య యుద్ధానికి దారితీసిన పరిస్థితులు ఏంటి?, చివరిగా తెరపై కనిపించే అసలు విలన్ ఎవరు?, కపాలకోన యువరాజు రుధిర ఏమవుతాడు? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబు దొరకాలంటే థియేటర్‌కు వెళ్లి ‘కంగువా’ను పలకరించి రావాల్సిందే.
కంగువాకు ఉన్న బలాబలాలు
1. కంగువా పాత్రలో రాజుగా, బౌంటీ హంటర్ పాత్రలో ఫ్రాన్సిస్‌గా రెండింటినీ చక్కగా బ్యాలెన్స్ చేసి ఎప్పటిలానే తనదైన నటనతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టేశాడు సూర్య.
2. కపాలకోన రాజు రుధిరగా బాబీ డియోల్ వస్తే ప్రేక్షకుడు భయపడేలా క్యారెక్టర్ చక్కగా డిజైన్ చేశారు.
3. దేవీశ్రీ ప్రసాద్ అందించిన బాణీలతో ఒకట్రెండు సాంగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా మాంచి అస్సెట్.
4. చిత్రీకరణ అంతా అడవుల్లో సాగడం, దానికి తగ్గట్టుగా గ్రాఫిక్స్ వర్క్… చిత్రం చూసే ప్రేక్షకుడిని వేరే లోకంలోకి తీసుకెళ్లడం పక్కా. విజువల్ వండర్‌గా కంగువాకు కితాబునివ్వొచ్చు.
5. 1,070 ఏళ్లనాటి సన్నివేశాలను తెరకెక్కించడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. ఎక్కడా అధునాతనంగా కనిపించకుండా చాలా జాగ్రత్తపడటంతో విజువల్‌కు ఎక్కడా పేరు పెట్టాల్సిన అవసరం లేదు.
6. సెకండాఫ్‌లో స్క్రీన్‌ప్లే అదిరిపోయింది. ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఆద్యంతం ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలతో ముందుకు నడిపించారు. సడన్‌గా వచ్చిన అతిథి క్యారెక్టర్…ఆపై కథకు కీరోల్ కావడంతో ప్రేక్షకుడు పార్ట్-2 కోసం వెయిట్ చేసేలా చక్కటి స్క్రీన్ ప్లేతో పార్ట్-1కి ముగింపు పలికారు.
7. ఈ మధ్యే లోకం విడిచివెళ్లిపోయిన నిశాద్ యూసుఫ్…కంగువాను బలంగా చూపి తన ఎడిటింగ్ కత్తెరకు పనిచెప్పడంతో చిత్ర యూనిట్ మనస్సులో ఎప్పటికీ పదిలంగా ఉండిపోతాడనే చెప్పాలి.
కంగువాకు ఉన్న బలహీనతలు
1) కథ మంచిదే, కానీ తెరకెక్కించడంలో డైరెక్టర్ శివ తడబాటుకు గురయ్యాడు అనే విధంగా ఫస్టాఫ్ ఉంటుంది.
2) నటుల మధ్య భావోద్వేగాలు ఎక్కడా పండకపోవడం మరో మైనస్ పాయింట్.
3) దిశాపటానీని అందగత్తె అని పెట్టుకున్నారు తప్ప…హీరోహీరోయిన్ల మధ్య సరైన కెమెస్ట్రీ లేకపోవడం.
4) స్టోరీలో చెప్పింది అడవిలోని ఐదు కోనలే కానీ…ప్రధానంగా ప్రణవ కోన, కపాలకోన జాతుల మధ్యే స్టోరీ సాగడంతో…వ్యూయర్ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ కాలేకపోయింది.
7) స్టోరీ మొత్తం చిన్న పిల్లాడి చుట్టూ సాగుతుండటంతో ఇదివరకే ఇలాంటి చిత్రాలని చూసేశాం అన్న ఫీలింగ్ రావడం.
(గమనిక – కంగువా చిత్ర సమీక్ష ప్రేక్షకుడి పరిధిలోనిది మాత్రమే)
రేటింగ్ : 3/5