ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంపీ కేశినాని శివనాథ్ ప్యానెల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నిమ్మగడ్డ రమేష్ ప్రకటించారు. సోమవారం అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగబోతుంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏసీఏను గుప్పెట్లో పెట్టుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక కార్యవర్గంలోని ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబసభ్యులు, అనుచరులు రాజీనామా చేశారు. వాటిని ఆమోదించిన అనంతరం జరిగిన ఎన్నికల్లో ఏసీఏ అధ్యక్షుడిగా కేశినేని చిన్నితోపాటు ప్యానెల్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారిక ప్రకటన వెలువడింది.
ప్యానెల్ మెంబర్స్ వీరే..!
ఏసీఏ ఉపాధ్యక్షుడిగా వెంకట ప్రశాంత్, ఏసీఏ కార్యదర్శిగా సానా సతీష్, జాయింట్ సెక్రటరీగా విష్ణుకుమార్ రాజా, కోశాధికారిగా దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్‌గా గౌరు విష్ణుతేజ్ ఎన్నికయ్యారు.
సత్తా గల ఆటగాళ్లే మా టార్గెట్: కేశినేని చిన్ని
ఏసీఏ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం మీడియాతో మాట్లాడిన కేశేనేని చిన్ని అన్నిప్రాంతాల్లో ఉపకేంద్రాలు ఏర్పాటుచేసి నైపుణ్యం గల ఆటగాళ్లను వెలుగులోకి తీసుకొస్తామని అన్నారు. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు విశాఖ ఒక్కటే కేంద్రంగా ఉందని…ఇకపై మంగళగిరి, కడపల్లో కూడా అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగేలా కృషిచేస్తామని ఏసీఏ అధ్యక్ష హోదాలో కేశినేని చిన్ని స్పష్టీకరించారు. కాగా, తొలినిర్ణయంగా ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళం ఏసీఏ తరఫున అందజేస్తామని చెప్పడం మరో విశేషం.