ఈడీ ఎదుట అజారుద్దీన్..!
హెచ్‌సీఏ అవకతవకలపై విచారణ
మాజీ ఎంపీ, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ ఈడీ విచారణకు హాజరయ్యారు. హెచ్‌సీఏలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అజార్‌కు ఈడీ ఇటీవలే నోటీసులు జారీ చేసింది. దీంతో మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీసులో ఆయన విచారణకు హాజరయ్యారు.
విచారణ అనంతరం అజారుద్దీన్ మీడియాతో మాట్లాడారు. తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియానికి సంబంధించి జనరేటర్లు, అగ్నిమాపక వాహనాలు, ఇతర సామాగ్రి కొనుగోళ్లకు సంబంధించి రూ.20 కోట్ల మేర అవకతవకలు జరిపినట్లు హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజార్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే కేసులో హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు వినోద్‌తోపాటు మాజీ క్రికెటర్లు అర్షద్ అయూబ్, శివలాల్ యాదవ్‌లను గడిచిన డిసెంబర్‌లో ఈడీ విచారించింది. గతేడాది నవంబర్ ఈ ముగ్గురి ఇళ్లు, ఆఫీసులపై ఏకకాలంలో సోదాలు నిర్వహించింది.
ఇక, గతేడాది అజార్దుదీన్‌పై ఉప్పల్ పీఎస్‌లో నాలుగు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. చీటింగ్, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదుచేశారు. నమోదైన నాలుగు కేసుల్లోనూ గతంలో సిటీ కోర్టు అజార్‌కు బెయిల్ మంజూరుచేసింది. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అజారుద్దీన్ 2019 నుంచి 2023 ఫిబ్రవరి వరకు బాధ్యతలు నిర్వర్తించారు. గడిచిన ఎన్నికల్లో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందిన అజారుద్దీన్…ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.