అభయ ఎఫెక్ట్..!
సందీప్ ఘోష్ సస్పెన్షన్…?
కోల్‌కతా ఆర్జీ కర్ కాలేజీ మరియు ఆస్పత్రిలో మెడికో అభయ హత్యాచార కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వరుస ఆరోపణలు, ఉవ్వెత్తున ఎగసిపడుతున్న విమర్శలతో కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌పై వేటు పడింది. ఇతడిని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. డాక్టర్ ఘోష్ తన వృత్తికి చెడ్డపేరు తీసుకొచ్చారని…అందుకు అతడిని జాతీయ వైద్య సంఘం సభ్యత్వం నుంచి తొలగించాలని క్రమశిక్షణాకమిటీ నిర్ణయం తీసుకుందని ఐఎంఏ తెలిపింది. అలాగే హత్యాచార బాధితురాలి తల్లిదండ్రుల మనోవేదనను డాక్టర్‌గా ఘోష్ అర్థం చేసుకోకుండా రూడ్‌గా బిహేవ్ చేయడం దారుణమని పేర్కొంది.
ఘోరం వెనుక ఘోష్..?
ఇదిలాఉంటే ఈకేసును సీబీఐ విచారిస్తున్న వేళ…మాజీ ప్రిన్సిపల్ ఘోష్‌పై ప్రశ్నలవర్షం కురిపించింది. అంతేకాదు ఘటన జరిగిన తీరుపై ఆయన మాట్లాడిన విధానం, ప్రవర్తనపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొంది. అభయపై హత్యాచారం జరిగితే ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం ఎందుకు చేయాల్సివచ్చింది..?, ఎందుకు ఆమె తల్లితండ్రులకు తప్పుడు సమాచారం ఇచ్చారు..?, బాధితురాలని చూసేందుకు సదరు తల్లిదండ్రులకు 3 గంటలు వేచిఉండేలా ఎందుకు ఆపాల్సివచ్చింది..?, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఘోష్‌నుంచి సమాధానాలు రావాల్సి ఉందంటున్నారు విచారణాధికారులు. మరోవైపు ఇతనికి పాలిగ్రాఫ్ టెస్ట్ కోసం ప్రత్యేక కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
దీదీ సర్కారుపై కోర్టు ఆగ్రహం..?
మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌పై దీదీ సర్కార్ అత్యుత్సాహాన్ని ధర్మాసనం కడిగిపారేసింది. ఘటన జరిగిన తర్వాత ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ నుంచి ఘోష్‌ను తొలగించి, వేరే కాలేజీలో వెంటనే అపాయింట్‌మెంట్ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది కోల్‌కతా హైకోర్టు. తీవ్రమైన ఆరోపణలు నెలకొన్నవేళ అతడిని ఎందుకు వేరే చోట నియమించారని మమత సర్కార్‌ను ప్రశ్నించింది. వెంటనే అతడిని ఆ పోస్టు నుంచి తొలగించాలని ఆదేశాలు జారీచేసింది.