మధ్యప్రదేశ్‌లో విషాదం
విషాహారం తిని 10ఏనుగులు మృత్యువాత
మధ్యప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. బాంధవ్‌ఘర్ టైరగ్ రిజర్వ్ వద్ద 10 అడవి ఏనుగులు మృత్యువాత పడటం కలకలం రేపింది. మైకోటాక్సిన్‌లు కలిగిఉన్న కోడో మిల్లెట్ పంటను తినడం వల్లే గజరాజుల మరణానికి కారణంగా శాస్త్రవేత్తలు నిర్థారించారు. దీంతో ఉమారియా జిల్లాలోని వ్యవసాయ క్షేత్రంలోని కోడో మిల్లెట్ పంటను మధ్యప్రదేశ్ అటవీశాఖ అధికారులు ధ్వంసం చేశారు.
మృతిచెందిన పది ఏనుగుల్లో మంగళవారం నాడు నాలుగు, బుధవారం మరో నాలుగు, గురువారం నాడు మరో రెండు గజరాజులు నేలకొరిగాయి. మరోవైపు, విషాహారం తిన్న మరో మూడు ఏనుగుల పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
ఏనుగుల మృతిపై తొలుత ఎలాంటి క్లారిటీ రాకపోయే సరికి వాటికి శవపంచనామా నిర్వహించారు వైద్యులు. దీంతో అసలు విషయం బట్టబయలైంది. స్థానికంగా ఉన్న అరికెల పొలాలు, ఏనుగులు నీళ్లు తాగిన శాంపిల్స్‌ను పరీక్షించిన వైద్యులు…అరికెల పంటకు వెదజల్లిన రసాయనాలే గజరాజుల మృతికి కారణంగా తేల్చారు. ఆ రసాయనాల్లో మైకోటాక్సిన్ ఉండటం వల్ల కోడో మిల్లెట్ పంటను తిన్న ఏనుగులన్నీ చనిపోయాయని తేల్చారు. మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఈఘటన దేశవ్యాప్తంగా మూగజీవాల ప్రేమికులందరికీ కంటతడి పెట్టించేలా చేసింది.